ప్రతిపక్షం, జూలై 08: తెలంగాణలో వివాహేతర సంబంధాల నేపథ్యంలో భర్తలను భార్యలే హత్య చేసిన రెండు ఘటనలు సంచలనం సృష్టిస్తున్నాయి. నిజామాబాద్, హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన ఈ కేసులు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం న్యాల్‌కల్‌లో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటనలో పోలీసులు భార్యను అరెస్ట్ చేశారు. తొలుత భర్తను డాబాపై నుంచి తోసేసి తీవ్రంగా గాయపరిచిన ఆమె, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో టాయిలెట్ క్లీనర్ (హార్పిక్) ద్రావణాన్ని శరీరంలోకి ఎక్కించి హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో భార్యతో పాటు ఆమె ప్రియుడు, మరో సహచరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరో ఘటన హైదరాబాద్‌లోని మియాపూర్‌లో వెలుగులోకి వచ్చింది. గత ఏడాది నవంబర్‌లో తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళే అసలు నిందితురాలిగా తేలింది. కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఆమె తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు గుర్తించారు.
ఈ రెండు ఘటనల్లోనూ వివాహేతర సంబంధాలే హత్యలకు ప్రధాన కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులపై హత్యతో పాటు ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
















