ప్రతిపక్షం, జూలై 08: కాళేశ్వరం ప్రాజెక్టు, సాగునీటి నిర్వహణ అంశాలపై బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గోదావరి, కృష్ణా నదుల్లో తగినంత నీరు ఉన్నప్పటికీ పంపులు నడపకపోవడం తీవ్రమైన నిర్లక్ష్యమని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ బాధ్యతలను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.
దేవాదుల ప్రాజెక్టు మోటార్లను ఎందుకు ప్రారంభించడం లేదని ప్రశ్నించిన హరీశ్‌రావు, తెలంగాణకు వినియోగించాల్సిన గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్‌కు వదులుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను విస్మరించిందని అన్నారు.
అలాగే తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు ఉన్నాయని నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని హరీశ్‌రావు సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం, సాగునీటి అంశాలపై ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని ఆరోపిస్తూ తన విమర్శలను కొనసాగించారు.


















