ప్రతిపక్షం, జూలై 08: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన అభిమాని నిరంజన్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇటీవల తనను కలిసిన ఆ చిన్నారితో గడిపిన క్షణాలు ఇప్పటికీ కళ్లముందే మెదులుతున్నాయని, ఇంతలోనే అతడు ఇక లేడనే వార్త తన హృదయాన్ని కలచివేసిందని తెలిపారు.
తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే తనను కలవాలని నిరంజన్ చూపిన ఆతృతను పవన్ గుర్తుచేసుకున్నారు. తనను చూడగానే చిన్నారి ముఖంపై విరిసిన చిరునవ్వు జీవితాంతం మరచిపోలేని జ్ఞాపకంగా నిలిచిపోతుందని భావోద్వేగంగా పేర్కొన్నారు.
నిరంజన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన పవన్ కళ్యాణ్, ఆ చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు.


















