18లోపు సీఎం టేబుల్‌పై విదేశీ విద్యా పర్యటన నివేదిక

ప్రతిపక్షం, జూలై 08: జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాల్లో విద్యా వ్యవస్థను అధ్యయనం చేసి వచ్చిన తెలంగాణ ఉన్నతాధికారులు, విశ్వవిద్యాలయాల ఉపకులపతులు తమ పరిశీలనలపై సమగ్ర నివేదిక సిద్ధం చేస్తున్నారు. వారం రోజుల పాటు ఆయా దేశాల్లోని విద్యా విధానాలు, విశ్వవిద్యాలయాల నిర్వహణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, సాంకేతిక ఆధారిత బోధనా విధానాలను 34 మంది సభ్యుల బృందం పరిశీలించింది.

విదేశీ పర్యటనలో గమనించిన అంశాలను తెలంగాణలో అమలు చేసే అవకాశాలపై అధికారులు విస్తృతంగా చర్చించి నివేదిక రూపొందిస్తున్నారు. ఈ నివేదికను ఈ నెల 18వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం విద్యాశాఖ బాధ్యతలు కూడా ముఖ్యమంత్రి వద్దే ఉండటంతో నివేదికను అత్యంత సమగ్రంగా, కార్యాచరణకు అనువుగా రూపొందించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో తీసుకురావాల్సిన సంస్కరణలపై సూచనలు ఇందులో ఉండనున్నాయి.

విదేశాల్లో అమలవుతున్న ఉత్తమ విద్యా విధానాలను తెలంగాణ అవసరాలకు అనుగుణంగా అమలు చేసే దిశగా ప్రభుత్వం ముందడుగు వేయాలని భావిస్తోంది. నివేదిక ఆధారంగా విద్యా రంగంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

Spread the love

Related News

Latest News