ప్రతిపక్షం, జూలై 08: మహిళల భద్రత, సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ తెలంగాణ మహిళా కమిషన్ రూపొందించిన ప్రత్యేక ప్రజా అవగాహన పోస్టర్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రజాభవన్‌లో ఆవిష్కరించారు. మంత్రి సీతక్క, తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల్ విజయలక్ష్మి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
‘నువ్వు ఒంటరి కాదు’ అనే నినాదంతో రూపొందించిన ఈ పోస్టర్లో మహిళలకు అవసరమైన హెల్ప్‌లైన్, వాట్సాప్ నంబర్లను పొందుపరిచారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలు వెంటనే సహాయం పొందేలా అవగాహన కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, మహిళల భద్రతపై ప్రతి ఒక్కరిలో చైతన్యం కల్పించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఈ పోస్టర్‌ను నగరాలకే పరిమితం చేయకుండా మారుమూల గ్రామాలు, పల్లెల వరకు తీసుకెళ్లాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
మహిళలు తమ హక్కులు, రక్షణకు సంబంధించిన సేవలపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సీఎం సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళల భద్రతకు ఈ అవగాహన కార్యక్రమం ఉపయోగపడుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.


















