ప్రతిపక్షం, జూలై 08: తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు విస్తరణ, ప్రైవేటు సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్ ఏర్పాటు అంశాలపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గోద్రేజ్ ఆగ్రోవెట్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో తొలి ప్రైవేటు సమీకృత ఆయిల్ పామ్ ప్రాజెక్టు పురోగతిపై చర్చించారు.
సమావేశంలో గోద్రేజ్ గ్రూప్ కార్పొరేట్ అఫేర్స్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి, ఆగ్రోవెట్ ఆయిల్ పామ్ బిజినెస్ సీఈఓ సౌగత నియోగి ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదికను ముఖ్యమంత్రికి అందజేశారు. ఖమ్మం జిల్లాలో రూ.300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా 700 మందికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.
కొనిజర్ల మండలం గుబ్బగుర్తి గ్రామంలో ప్రభుత్వం ఇప్పటికే 113.5 ఎకరాల భూమిని కేటాయించిందని, అక్కడ ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్, నర్సరీ, పరిశోధన–అభివృద్ధి కేంద్రం, సీడ్ గార్డెన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. సీడ్ గార్డెన్ విస్తరణ కోసం అదనంగా 35 నుంచి 40 ఎకరాల భూమిని కేటాయించాలని, ప్రాసెసింగ్ యూనిట్‌కు వెళ్లే రహదారిని విస్తరించాలని కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు.
ఈ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి, రహదారి విస్తరణ పనులను తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) ఆధ్వర్యంలో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆయిల్ పామ్ సాగు విస్తరణతో రైతులకు మెరుగైన ఆదాయం, రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు మరింత ఊతం లభిస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.


















