- దళిత క్రైస్తవులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నంటే ఉంటుంది
- రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ప్రతిపక్షం స్టేట్ బ్యూరో, ఉత్తర తెలంగాణ, జూలై 8: మతం మారినంత మాత్రాన దళిత క్రైస్తవుల సామాజిక స్థితిగతులు, వారు ఎదుర్కొంటున్న కుల వివక్ష, పేదరికం మారడం లేదని, అటువంటప్పుడు వారికి దక్కాల్సిన రాజ్యాంగబద్ధమైన హక్కులను నిరాకరించడం సరికాదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనే డిమాండ్ చాలా దశాబ్దాలుగా ఈ సమస్య ఎదుర్కొంటుందన్నారు. రాజ్యాంగం కల్పించిన సామాజిక న్యాయం కోసం జరుగుతున్న పోరాటమని ఆయన స్పష్టం చేశారు.బుధవారం హైదరాబాద్‌లోని బేగంపేట టూరిజం ప్లాజాలో నిర్వహించిన దళిత క్రైస్తవ రిజర్వేషన్ల సమాలోచన సభలో మైనార్టీ శాఖ మంత్రి శ్రీ మహ్మద్ అజారుద్దీన్ తో కలిసి సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లురి మాట్లాడుతూ.. మన హక్కు కోసం చేరాం. గ్రామంలో, సమాజంలో, ఉపాధిలో, విద్యలో ఎదుర్కొంటున్న వివక్ష మారనప్పుడు హక్కులు మాత్రం ఎందుకు మారాలి? అని మంత్రి ప్రశ్నించారు.దళిత క్రైస్తవుల సమస్యను కేవలం ఒక మతపరమైన అంశంగా చూడరాదని, భారత రాజ్యాంగం ముందు నిలిచిన సామాజిక న్యాయ ప్రశ్నగా గుర్తించాలని పిలుపునిచ్చారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కమిటీలు, నివేదికల పేరుతో దశాబ్దాలుగా కాలయాపన చేస్తోందని మంత్రి విమర్శించారు. న్యాయాన్ని వాయిదా వేయడమంటే న్యాయాన్ని నిరాకరించడమేనని కేంద్రం తీరుపై ఆయన మండిపడ్డారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ పరమైన చర్యలు చేపట్టి దళిత క్రైస్తవుల వాస్తవ సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ మంత్రి చేశారు.
ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుంది
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అణగారిన వర్గాలు, మైనార్టీలు, దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణకు సంపూర్ణంగా కట్టుబడి ఉందని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సభలో వచ్చిన సూచనలు, మేధావుల అభిప్రాయాలను ఒక సమగ్ర నివేదికగా రూపొందించి ముఖ్యమంత్రికి అందజేస్తానని, అసెంబ్లీలోనూ, పార్లమెంట్ స్థాయిలోనూ ఈ అంశంపై ఒత్తిడి తీసుకువచ్చేలా కృషి చేస్తానని తెలిపారు.లోక్ సభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ఆశయం కూడా ఇదేనని, వివక్షకు గురవుతున్న ప్రతి వర్గానికి న్యాయం చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ పోరాటం కేవలం సభలకే పరిమితం కాకూడదని, ఇది ఒక ప్రజా ఉద్యమంగా మారాలని మంత్రి పిలుపునిచ్చారు. బిషప్‌లు, పాస్టర్లు, దళిత సంఘాల నేతలు ఐక్యంగా ముందుకు సాగితేనే ఈ లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. దళిత క్రైస్తవుల పిల్లలు చదువులో ఎదగాలని, ఆర్థికంగా బలపడాలని ఆకాంక్షించారు.అనంతరం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాశింమాట్లాడుతూ*.. 1950 నాటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ దళిత క్రైస్తవుల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఆర్పీఎస్ ఉద్యమ స్ఫూర్తితో దళిత క్రైస్తవులు కూడా ఐక్యంగా పోరాడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ దీపక్ జాన్, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, రక్షణ టీవీ సీఈవో మోహన్ బాబుతో పాటు పలు జిల్లాల నుంచి వచ్చిన బిషప్‌లు, పాస్టర్లు, క్రైస్తవ సంస్థల ప్రతినిధులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

















