ప్రతిపక్షం, జూలై 08: కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని ఎస్సీ బాలికల హాస్టల్‌లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. హాస్టల్‌లో నివసిస్తున్న అమృత (18) తన గదిలో ఉరివేసుకుని మృతిచెందింది. ఘటనతో హాస్టల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
విద్యార్థిని మృతికి హాస్టల్‌లో ఎదురైన ఇబ్బందులే కారణమని ఆమె కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. హాస్టల్‌లో చేర్పించేందుకు రూ.10 వేల రూపాయలు ఇవ్వాలని వార్డెన్ కోరినట్లు అమృత ఫోన్‌లో తమకు చెప్పిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
అమృత గదిలో ఉరివేసుకుని ఉండగా, సమాచారం అందుకున్న తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని కిందకు దించినట్లు వారు పేర్కొన్నారు. ఈ ఘటనపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల అసలు కారణాలపై విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం హాస్టల్ నిర్వహణపై వచ్చిన ఆరోపణలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.

















