ప్రతిపక్షం, జూలై 09: హైదరాబాద్‌లో జరుగుతున్న గ్రీన్ గ్రోత్ ఎకనమిక్ సమ్మిట్–2026 సందర్భంగా వివిధ దేశాలకు చెందిన అంతర్జాతీయ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ భేటీలో తెలంగాణలో పెట్టుబడి అవకాశాలు, పారిశ్రామికాభివృద్ధి, భవిష్యత్తు భాగస్వామ్యాలపై విస్తృతంగా చర్చించారు. మలేషియా, అమెరికా, నార్వే, దక్షిణాఫ్రికా, శ్రీలంక తదితర దేశాలకు చెందిన ప్రభుత్వ ప్రతినిధులు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యత, పారదర్శక పాలన, ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధి, కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం, సుస్థిర ఆర్థికాభివృద్ధి, భవిష్యత్తు పెట్టుబడి అవకాశాలు వంటి కీలక అంశాలపై ప్రతినిధి బృందం ముఖ్యమంత్రితో అభిప్రాయాలు పంచుకుంది. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, సాంకేతిక రంగంలో రాష్ట్రం సాధిస్తున్న పురోగతిపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం.
ఈ సమావేశంలో గ్రీన్ గ్రోత్ ఎకనమిక్ సమ్మిట్ నిర్వహిస్తున్న మెరీడియన్ కలెక్టివ్ ప్రతినిధులు, లోక్‌సభ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణను గ్రీన్ ఎకానమీ, సుస్థిర పెట్టుబడులు, సాంకేతిక ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఇటువంటి అంతర్జాతీయ భాగస్వామ్యాలు కీలకమని ఈ సందర్భంగా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.


















