వినాయక విగ్రహాలకు ఎత్తు పరిమితి.. హైదరాబాద్ పోలీసుల కీలక మార్గదర్శకాలు

ప్రతిపక్షం, జూలై 09: వినాయక చవితి ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులతో హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సమావేశమై ఉత్సవాల నిర్వహణ, విగ్రహాల ఏర్పాటు, నిమజ్జన ఊరేగింపుల సందర్భంగా పాటించాల్సిన జాగ్రత్తలపై కీలక సూచనలు చేశారు.

ప్రజల ప్రాణ భద్రతే ప్రధాన లక్ష్యమని పేర్కొన్న సీపీ, గతంలో విద్యుత్ తీగలను తాకి జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా నిమజ్జన ఊరేగింపుల్లో తీసుకెళ్లే వినాయక విగ్రహాల ఎత్తు 15 అడుగులకు మించకుండా ఉండేలా నిర్వాహకులు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

విద్యుత్ తీగల ఎత్తు సుమారు 22 అడుగులు, విగ్రహాలను తరలించే ట్రాలీల ఎత్తు సుమారు 4 అడుగులు ఉండటంతో భద్రతా పరంగా విగ్రహాల ఎత్తును 15 అడుగుల లోపే పరిమితం చేయాలని సూచించారు. దీంతో విద్యుత్ తీగలను తాకే ప్రమాదాన్ని నివారించవచ్చని తెలిపారు.

అలాగే ఊరేగింపుల సమయంలో విద్యుత్ తీగలను కర్రలు లేదా ఇతర వస్తువులతో పైకి ఎత్తే ప్రయత్నాలు చేయవద్దని నిర్వాహకులకు హెచ్చరించారు. అలాంటి చర్యలు ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని పేర్కొన్నారు. విద్యుత్ శాఖ, పోలీసు శాఖ సూచనలను పాటిస్తూ ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో పాటు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించేందుకు గణేశ్ ఉత్సవ కమిటీలు పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని సహకరించాలని సీపీ కోరారు.

Spread the love

Related News

Latest News