- ప్రీమియర్ ఎనర్జీస్ సోలార్ మాడ్యూల్ తయారీ కేంద్రం ప్రారంభం
ప్రతిపక్షం స్టేట్ బ్యూరో, ఉత్తర తెలంగాణ, జూలై 09: తెలంగాణలో పెట్టుబడులు పెట్టే సంస్థలు కేవలం కార్యకలాపాలు నిర్వహించడమే కాకుండా… ఇక్కడే ఆవిష్కరణలు చేపట్టి, ఇక్కడే తయారీ చేసి ప్రపంచ మార్కెట్లకు ఉత్పత్తులను అందించే స్థాయికి ఎదగాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. ‘మేడ్ ఇన్ తెలంగాణ’ బ్రాండ్‌ను ప్రపంచవ్యాప్తంగా మరింత బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపురంలో ‘ప్రీమియర్ ఎనర్జీస్’ ఏర్పాటు చేసిన “ఇండియా ’స్ నెక్స్ట్ జేన్ సోలార్ మోడల్ మణి ఫాక్చరింగ్ ఫెసిలిటీ ” ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగించారు.ప్రపంచ స్థాయి సంస్థలు తమ కార్యకలాపాలకు తెలంగాణను ఎంచుకోవడం రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి, ప్రభుత్వంపై పెట్టుబడిదారుల నమ్మకానికి నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణను క్లీన్ ఎనర్జీ, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్, ఇన్నోవేషన్, సుస్థిరాభివృద్ధికి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ‘తెలంగాణ రైజింగ్–2047’ విజన్తో ముందుకు సాగుతున్నామని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ ద్వారా పునరుత్పాదక ఇంధనం, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, గ్రీన్ హైడ్రోజన్, అధునాతన తయారీ రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా ఇంధన రంగంలో భారీ పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి తెలిపారు. ఈ ఏడాది ఇంధన రంగంలో సుమారు 3.4 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, అందులో దాదాపు 2.2 ట్రిలియన్ డాలర్లు క్లీన్ ఎనర్జీ రంగంలోకి వచ్చే అవకాశముందని అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) అంచనా వేస్తోందని వివరించారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లు, ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణతో దేశంలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరగనుందని, రాబోయే కాలంలో విద్యుత్ అవసరాలు కొత్త స్థాయికి చేరుకోనున్నాయని మంత్రి అన్నారు. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ రంగంలోనూ భారీ అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.ఈ అవకాశాలను తెలంగాణ అందిపుచ్చుకునేలా సోలార్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్, గ్రీన్ టెక్నాలజీ రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని శ్రీధర్ బాబు తెలిపారు. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేలా, మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేలా రాష్ట్రంలో సమగ్ర పారిశ్రామిక ఎకో సిస్టంను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
“తెలంగాణ అంటే విజన్, అవకాశాల కలయిక. ఆలోచనలు పరిశ్రమలుగా మారే వేదిక. నమ్మకానికి, వేగవంతమైన వృద్ధికి తెలంగాణ ప్రతీక” అని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి ‘రైజింగ్ తెలంగాణ’లో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలకు ఆయన పిలుపునిచ్చారు.పరిశ్రమలకు ప్రోత్సాహకంగా 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న సబ్సిడీలను దశలవారీగా చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. సీతారాంపూర్‌లో భూములు ఇచ్చిన రైతుల సమస్యలను కూడా త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

















