ప్రతిపక్షం, జూలై 09: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్తగూడెంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు చేశారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్లీ బీఆర్ఎస్‌లో చేరేది లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఖాతాలో ఉన్న రూ.1,400 కోట్ల అవినీతి సొమ్మును తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పంచాలని డిమాండ్ చేశారు. తన పార్టీకి భయం లేదని చెబుతూనే బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల సంఘానికి వెయ్యికి పైగా ఫిర్యాదులు చేశారని ఆరోపించారు.
తనపై, తన పార్టీపై తప్పుడు ప్రచారం జరుగుతోందని, టీఆర్ఎస్ అనే పేరు తనకు రాకుండా కుట్రలు చేస్తున్నారని కవిత అన్నారు. కేటీఆర్ తన మిత్రులకు అక్రమ అనుమతులు ఇచ్చారని, హరీశ్‌రావు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో కీలక పాత్ర పోషించారని ఆరోపించారు. బీఆర్ఎస్‌కు ప్రజా అజెండా లేదని, కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ప్రజా సమస్యల కంటే రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పటికీ నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం కక్షసాధింపు ధోరణితో రైతులకు అన్యాయం చేస్తోందని కవిత అన్నారు. రైతు భరోసా అమలులో ప్రభుత్వం పలుమార్లు హామీలు తప్పిందని, యూరియా పంపిణీ, బోనస్ వంటి అంశాల్లో కూడా రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు.
సింగరేణి సంస్థకు కేంద్రం నిజాం కాలం నుంచి ఉన్న అన్ని బొగ్గు గనులను అప్పగించాలని కవిత డిమాండ్ చేశారు. తాడిచెర్ల-2 బొగ్గు గనిని పూర్తిగా సింగరేణి ద్వారానే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సింగరేణి కార్మికుల సమస్యలు, ఆధారిత ఉద్యోగాలు, మెడికల్ బోర్డుల ఏర్పాటు, స్థానికులకు ఉద్యోగాల కల్పన వంటి అంశాల్లో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాలు, అవసరమైతే నిరాహార దీక్ష కూడా చేపడతామని హెచ్చరించారు.



















