ప్రతిపక్షం, జూలై 10: కొత్తగూడెంలోని పీవీకే-5 గనిలో సింగరేణి కార్మికులతో కలిసి మాట్లాడిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, కార్మికుల సమస్యల పరిష్కారానికి తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. నిజాం కాలంలో సింగరేణికి కేటాయించిన 17 బొగ్గు గనుల్లో ప్రస్తుతం ఒక్క గని మాత్రమే తిరిగి ఇచ్చారని, మిగిలిన 16 గనులను కూడా సింగరేణికి అప్పగించే వరకు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని తెలిపారు. సింగరేణిలో నెలకు రెండుసార్లు మెడికల్ బోర్డు నిర్వహించి పెండింగ్‌లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 20లోపు ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోతే నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు.
కార్మికుల భద్రత, సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న కవిత, నాసిరకం భద్రతా సామగ్రి, తాగునీరు, గాలి వంటి ప్రాథమిక సౌకర్యాల లేమిపై ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికుల హక్కులను కాపాడేందుకు అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని, కార్మికులే సంస్థకు వెన్నెముక అని అన్నారు. కేంద్రం కార్మిక చట్టాలను కుదించడం వల్ల హక్కులు దెబ్బతింటున్నాయని విమర్శిస్తూ, వాటిపై రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరారు. భవిష్యత్తులో తమ పార్టీ అధికారంలోకి వస్తే బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని సింగరేణి ఆధ్వర్యంలో నడిపిస్తామని, రాష్ట్రంలోని ఇసుక తవ్వకాలను కూడా సింగరేణికే అప్పగిస్తామని ప్రకటించారు.




















