ప్రతిపక్షం, జూలై 10: వర్షాకాలంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని 169 బస్తీ దవాఖానల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో వైద్య సేవల నాణ్యతను అంచనా వేయడానికి ప్రత్యేక అధికారులను నియమిస్తూ చర్యలు చేపట్టింది.
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ తనిఖీలను స్వయంగా పర్యవేక్షించనున్నట్లు వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక అలాతో కలిసి బస్తీ దవాఖానలను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించనున్నట్లు తెలిపారు.
ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువగా విజృంభించే డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు వంటి సీజనల్ వ్యాధుల నివారణ చర్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. రోగులకు అవసరమైన మందులు తగినంతగా అందుబాటులో ఉన్నాయా, వైద్య సిబ్బంది పూర్తిస్థాయిలో విధులకు హాజరవుతున్నారా, రోగులకు అందుతున్న సేవల నాణ్యత ఎలా ఉందనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు.
అలాగే ప్రతి బస్తీ దవాఖానలో పారిశుధ్య నిర్వహణ, వైద్య పరికరాల వినియోగం, అత్యవసర చికిత్సల సౌకర్యాలు, ప్రజలకు అందుతున్న సేవలపై కూడా సమీక్ష నిర్వహించనున్నారు. లోపాలు గుర్తించిన చోట వెంటనే సరిదిద్దేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు సమాచారం.
వర్షాకాలంలో అంటువ్యాధుల వ్యాప్తిని అరికట్టడం, ప్రజలకు సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక తనిఖీలతో బస్తీ దవాఖానల పనితీరు మరింత మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
















