ప్రతిపక్షం, జూలై 10: దివంగత తెలుగు సినీ నటుడు శోభన్ బాబు సతీమణి శాంతకుమారి(86) కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతో ఏర్పడిన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
శాంతకుమారి అంత్యక్రియలను శుక్రవారం నిర్వహించనున్నట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. ఆమె మృతి వార్తతో కుటుంబ సభ్యులు, బంధువులు, శోభన్ బాబు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
శోభన్ బాబు, శాంతకుమారి దంపతుల వివాహం 1958 మే 15న జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబ జీవితానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన శోభన్ బాబు సినీ రంగంలో స్టార్ హీరోగా వెలుగొందినప్పటికీ వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచేవారు.
కాగా, శోభన్ బాబు 2008లో గుండెపోటుతో కన్నుమూశారు. తాజాగా ఆయన సతీమణి శాంతకుమారి మరణంతో ఆ కుటుంబంలో మరోసారి విషాదం నెలకొంది. అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు నివాళులు అర్పిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.


















