ప్రతిపక్షం, జూలై 10: అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో విశిష్ట ప్రతిభ కనబర్చిన హైదరాబాద్‌కు చెందిన క్రీడాకారులను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. క్రీడల్లో రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకొచ్చిన క్రీడాకారులకు కోట్ల రూపాయల నగదు ప్రోత్సాహకాలను అందజేస్తూ వారి విజయాలను ప్రభుత్వం అభినందించింది.
వివిధ క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన షూటర్ ధనూష్ శ్రీకాంత్‌కు రూ.2.10 కోట్లు, షూటింగ్ స్టార్ ఇషా సింగ్‌కు రూ.3.30 కోట్లు నగదు ప్రోత్సాహకంగా అందజేశారు. అంతర్జాతీయ బాక్సర్ నిఖత్ జరీన్‌కు రూ.60 లక్షలు, షూటర్ తనిష్క్ మురళీధర్‌కు రూ.53.65 లక్షలు, మరో షూటర్ సురభి భరద్వాజ్‌కు రూ.10 లక్షలు నగదు బహుమతులను ప్రభుత్వం ప్రదానం చేసింది.
గచ్చీబౌలిలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి క్రీడాకారులకు చెక్కులను అందజేసి అభినందించారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచే యువతను ప్రోత్సహించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించే క్రీడాకారులకు అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
తెలంగాణలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు ఆధునిక శిక్షణా కేంద్రాలు, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా క్రీడా రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అధికారులు తెలిపారు. క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలతో పాటు భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు, శిక్షణ సౌకర్యాలు కూడా కల్పించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.


















