ప్రతిపక్షం, జూలై 10: తెలంగాణలో పార్టీ బలోపేతంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో చేరాలనుకునే ప్రతి ఒక్కరికీ బీజేపీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉండాలని రాష్ట్ర నాయకత్వానికి సూచించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్‌లో తెలంగాణ బీజేపీ నేతలతో జరిగిన సమావేశంలో మాట్లాడిన నడ్డా.. పార్టీ విస్తరణకు ప్రజల్లో మరింత చేరువ కావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు దేశవ్యాప్తంగా ప్రజల్లో విశేష ఆదరణ ఉందని, అదే తరహాలో తమ తమ నియోజకవర్గాల్లో నాయకులు ప్రజల విశ్వాసాన్ని సంపాదించేందుకు కృషి చేయాలని సూచించారు.
కార్యకర్తలే పార్టీకి బలమని పేర్కొన్న ఆయన.. వారితో సన్నిహితంగా మెలగాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా వ్యవహరించాలని నేతలకు సూచించారు. తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసి అధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని జేపీ నడ్డా స్పష్టం చేశారు.


















