ఒవైసీ కళాశాలపై కవిత విమర్శలు.. ‘రేవంత్‌కు కనిపించడం లేదా?’ అంటూ ప్రశ్న

ప్రతిపక్షం, జూలై 10: తెలంగాణలో హైడ్రా చర్యలు, చెరువుల ఆక్రమణల అంశంపై టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఒవైసీకి చెందిన విద్యాసంస్థలను కాపాడేందుకు ప్రభుత్వం కోర్టులను కూడా తప్పుదోవ పట్టిస్తోందని ఆమె ఆరోపించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందించిన కవిత.. హైడ్రాను అడ్డం పెట్టుకుని హైదరాబాద్‌లో పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడుపుతున్న ప్రభుత్వం, చెరువును ఆక్రమించి నిర్మించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కళాశాల విషయంలో మాత్రం మౌనం పాటిస్తోందని విమర్శించారు. ప్రపంచమంతా ఆ నిర్మాణాన్ని చూస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రమే కనిపించడం లేదని, వెంటనే కంటి పరీక్ష చేయించుకోవాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా సల్కం చెరువు ప్రాంతానికి సంబంధించిన శాటిలైట్ చిత్రాన్ని కూడా కవిత తన పోస్టులో పంచుకున్నారు. ప్రభుత్వం అక్రమ నిర్మాణాల విషయంలో ఎంపిక చేసిన లక్ష్యాలపైనే చర్యలు తీసుకుంటోందని, ఒకే రకమైన నిబంధనలు అందరికీ వర్తించేలా వ్యవహరించాలని ఆమె డిమాండ్ చేశారు.

హైడ్రా చేపడుతున్న కూల్చివేతలు, చెరువుల పరిరక్షణ చర్యలపై ఇప్పటికే రాజకీయంగా తీవ్ర చర్చ కొనసాగుతున్న వేళ కవిత చేసిన తాజా వ్యాఖ్యలు మరోసారి రాజకీయ వేడిని పెంచాయి. అయితే కవిత ఆరోపణలపై ప్రభుత్వం లేదా సంబంధిత వర్గాల నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది.

Spread the love

Related News

Latest News