- రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా జర్మన్ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించండి
- జర్మనీ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో భేటీలో మంత్రి శ్రీధర్ బాబు
ప్రతిపక్షం స్టేట్ బ్యూరో, ఉత్తర తెలంగాణ, జూలై 10: తయారీ రంగంలో పరిశ్రమల ఏర్పాటుకు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అత్యంత అనుకూలమని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా జర్మనీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని ఆ దేశ అత్యున్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. పెట్టుబడులకు అనుకూలమైన పారిశ్రామిక విధానాలు, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులతో ప్రపంచ స్థాయి తయారీ కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామన్నారు. బవేరియన్(జర్మనీ) మినిస్ట్రీ ఆఫ్ ఎకానమిక్ అఫైర్స్, రీజినల్ డెవలప్‌మెంట్ అండ్ ఎనర్జీ వైస్ మినిస్టర్ టోబియాస్ గోత్‌హార్ట్ నేతృత్వంలోని జర్మనీ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం శుక్రవారం డా.బీఆర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ భేటీలో ‘తెలంగాణ – జర్మనీ’ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు గల అవకాశాలపై చర్చించారు. పారిశ్రామికాభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, పరిశ్రమలకు కల్పిస్తున్న ప్రోత్సాహకాలను ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. లైఫ్ సైన్సెస్, బయో టెక్నాలజీ, ఏరో స్పేస్, డిఫెన్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రెసిషన్ ఇంజినీరింగ్, డిజిటల్ ఇంజినీరింగ్, సెమీకండక్టర్లు, ఆటోమోటివ్ అండ్ మొబిలిటీ, ఏఐ, డిజిటల్ హెల్త్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్, క్లీన్ ఎనర్జీ, జీసీసీలు, ఇండస్ట్రీ 4.o తదితర రంగాల్లో తెలంగాణలో విస్తృత పెట్టుబడి అవకాశాలు ఉన్నాయన్నారు. అత్యాధునిక సాంకేతికత, పరిశోధన, ఇన్నోవేషన్, స్కిల్లింగ్‌కు ప్రాధాన్యమిస్తూ… ఈ రంగాల్లో భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా సమగ్ర ఎకోసిస్టమ్‌ను రాష్ట్రంలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ‘తెలంగాణ–జర్మనీ’ మధ్య భాగస్వామ్యాన్ని పెట్టుబడులకు మాత్రమే పరిమితం కాకుండా సాంకేతికత, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి రంగాలకూ విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సమావేశంలో జర్మనీ కాన్సుల్ జనరల్ మైఖేల్ హాస్పర్, హైదరాబాద్‌లో జర్మనీ గౌరవ కాన్సుల్ అమితా దేశాయ్, బవేరియా ఆర్థిక శాఖ ఈడీ ఉల్రికే హాఫ్‌మన్, బవేరియా ఇండియా కార్యాలయ ఈడీ జాన్ కొట్టాయిల్ తదితరులు పాల్గొన్నారు.



















