కేసీఆర్ కు పట్టిన గతే రేవంత్ కు పడుతోంది

  • ఏఐఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి
  • జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్
  • విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టు

ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, జూలై 10: తెలంగాణలో విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలైన ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ, ఏఐడీఎస్‌ఓ, ఏఐఎఫ్‌డీఎస్, ఏఐఎస్‌బీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన కేజీ నుంచి పీజీ వరకు విద్యాసంస్థల బంద్ విజయవంతమైందని ఆయా సంఘాల నాయకులు తెలిపారు.తెలంగాణ చౌక్ నుంచి ప్రభుత్వ విద్యాసంస్థలను బంద్‌లో భాగస్వామ్యం చేసేందుకు బైక్ ర్యాలీగా వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, ఏఐఎస్‌బీ, ఏఐఎఫ్‌డీఎస్ నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు తరలించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది కొరత, మౌలిక వసతుల లేమి, హాస్టళ్లలో దయనీయ పరిస్థితులు, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు, ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీ వంటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

జిల్లాలోని పలు ప్రైవేట్ విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్‌కు మద్దతు తెలిపాయని, ప్రభుత్వ విద్యాసంస్థలను బంద్‌లో భాగస్వామ్యం కాకుండా పోలీసుల ద్వారా అడ్డుకునే ప్రయత్నాలు జరిగినప్పటికీ అనేక చోట్ల బంద్ విజయవంతమైందని తెలిపారు.విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక, అధ్యాపకేతర పోస్టులను భర్తీ చేయాలని, అన్ని విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలని, హాస్టళ్లలో నాణ్యమైన భోజనం, తాగునీరు, వైద్య సదుపాయాలు అందించాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, మహిళా విద్యార్థుల భద్రత కోసం ప్రతి విద్యాసంస్థలో ఐసీసీ కమిటీలను ఏర్పాటు చేయాలని, విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని, కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలని, జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ–2020) అమలును నిలిపివేసి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శులు రామప్రతాప్, అంగడి కుమార్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్, ఏఐఎఫ్‌డీఎస్ జిల్లా కార్యదర్శి గడ్డం శ్రీకాంత్, ఏఐఎస్‌బీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అతీకము రాజశేఖర్, అలాగే మామిడిపల్లి హేమంత్, నునవాత్ శ్రీనివాస్ నాయక్, రోహిత్, సురేష్, నరేష్, అస్లాం తదితర విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News