Trending Now

ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరచాలి

అభివృద్ధి కార్యక్రమాలపై నిరంతర పర్యవేక్షణ జరగాలి.

నర్వ యాస్పరేషన్ బ్లాక్ లో విసృతంగా పర్యటించిన
నీతి ఆయోగ్ డిప్యూటీ సెక్రటరీ/ అడిషనల్ మిషన్ డైరెక్టర్ గౌరవ్ కటియార్.

ప్రతిపక్షం ప్రతినిధి, నారాయణపేట్, ఫిబ్రవరి 24:

ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరచే దిశగా అధికారులు అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించాలని నీతి ఆయోగ్ డిప్యూటీ సెక్రటరీ/ అడిషనల్ మిషన్ డైరెక్టర్ గౌరవ్ కటియార్ సూచించారు. నారాయణపేట జిల్లాకు వచ్చిన ఆయన మంగళవారం జిల్లాలోని నర్వ యాస్పరేషన్ బ్లాక్ మండలంలోని పెద్ద కడుమూరు,రాయికోడ్, పాతర్ చేడ్, నర్వ గ్రామాలలో విసృతంగా పర్యటించారు. ఆయా గ్రామాల్లో పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలు, ఇందిరమ్మ ఇంటి నిర్మాణం, పశు వైద్య శిబిరాలు, ఆరోగ్య కేంద్రాల్లో వసతులు, మహిళల అభ్యున్నతికి చేపడుతున్న కార్యక్రమాలను ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ముందుగా పెద్ద కడుమూరు గ్రామానికి చేరుకున్న గౌరవ్ కటియార్ పీఎం శ్రీ జెడ్పీ ఉన్నత, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. విద్యార్థులు చేస్తున్న యోగా ఆసనాలను తిలకించారు.
పాఠశాలలో కొనసాగుతున్న డిజిటల్ క్లాస్ ను, ఉన్నత పాఠశాలకు చెందిన సైన్స్ ల్యాబ్ ను, ల్యాబ్ లో ఆధునాతన పరికరాలను ఆసక్తిగా పరిశీలించారు. ఏ ఎక్స్ ఎల్ బోధనా విధానాన్ని చూశారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యా వివరాలను అడిగి వారికి అవసరమైన వసతి సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థులలో పఠనాశక్తిని పెంచేలా చూడాలని ఉపాధ్యాయులకు ఆయన సూచించారు. పీఎం శ్రీ నిధుల మంజూరు, వినియోగం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండలంలోని రాయికోడ్ గ్రామానికి చేరుకున్న గౌరవ్ కటియార్ అంగన్ వాడీ కేంద్రాన్ని సందర్శించి కేంద్రంలో పిల్లల అభ్యాసన సామర్థ్యాలను పరిశీలించారు. అంగన్ వాడీ కేంద్రంలో పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం గురించి అడిగి తెలుసుకున్నారు. చిన్నారులు చెప్పిన చిన్న చిన్న గేయాలను విని వారిని అభినందించారు. ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్, నీతి అయోగ్ రాష్ట్ర సమన్వయకర్త లోకేష్ తో కలిసి గ్రామానికి చెందిన గర్భిణీలకు చీర,గాజులు, పసుపు కుంకుమ పెట్టీ శ్రీమంతం చేసి, చిన్నారులకు అన్న ప్రాసన అక్షరాభ్యాసం చేయించారు. గ్రామానికి చెందిన ఫాతిమా బేగం నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇంటిని ఆయన పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇంటి పేరిట మంజూరు చేస్తున్న ఈ పథకంలో ప్రధాన మంత్రి అవాస్ యోజన కింద చెల్లిస్తున్న వాటా కూడా ఉంది కదా అని హౌసింగ్ పీడీ శంకర్ ను ప్రశ్నించగా అవును అని పీడీ సమాధానమిచ్చారు. ఆ తర్వాత పాతర్ చేడ్ గ్రామంలో పశువులకు ఏర్పాటు చేసిన ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసే శిబిరాన్ని కటియార్ సందర్శించి పశువులకు టీకాలు వేసే విధానాన్ని పరిశీలించారు. అనంతరం నర్వ మండల కేంద్రంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ లో కొనసాగుతున్న అంగన్ వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన కటియార్ అక్కడి వసతి సౌకర్యాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రానికి మరుగు దొడ్డి లేదని వెంటనే ఏర్పాటు చేయించాలని అధికారులకు సూచించారు. అయితే అంగన్ వాడీ కేంద్రం నిర్మాణం కోసం వేరే చోట స్థలం చూపించామని, కొత్త భవన నిర్మాణానికి అనుమతి అవసరమని గ్రామ ప్రజా ప్రతినిధులు కొందరు కోరారు. అందుకు కటియార్ సానుకూలంగా స్పందించారు. దశల వారీగా అంగన్ వాడీ కేంద్రాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఆ తర్వాత ఆయన నర్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి నిరుపేదలకు అందిస్తున్న వైద్య సేవల గురించి విచారించారు. ఆస్పత్రిలోని ప్రసవ గదిని పరిశీలించి, నెలకు ఎన్ని ప్రసవాలు జరుగుతాయని, రోజుకు ఓ.పీ. ఎంత మంది, అవసరమైన మందులన్నీ అందుబాటులో ఉన్నాయా ?. వైద్య సిబ్బందిని అందరూ ఉన్నారా ?.ఏమైనా ఖాళీలు ఉన్నాయా అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జయ చంద్రమోహన్ ను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రికి సంబంధించిన అన్ని రికార్డులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే ఆస్పత్రికి వచ్చిన నర్వ సర్పంచి హనుమంత్ రెడ్డి గౌరవ్ కటియార్ కు ఆస్పత్రి భవన పై కప్పు, ఒక గది పై కప్పు పెచ్చులూడిందని ఫిర్యాదు చేసి చూపించారు. దీనిపై కటియార్ స్పందిస్తూ.. తాత్కాలిక మరమ్మతులకు ఆస్కారం ఉంటే చేయించాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. చివరగా ఆయన నర్వ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని మండల మహిళా సమాఖ్య భవనంలో మండలానికి చెందిన మహిళా సంఘాల సభ్యులు నిర్వహిస్తున్న పాఠశాల యూనిఫాం కుట్టు కేంద్రాన్ని సందర్శించి మహిళలు కుడుతున్న స్కూల్ యూనిఫామ్స్ ను పరిశీలించారు. ఏడాది పొడవునా స్కూల్ యూనిఫామ్స్ కుడాతారా ?.అని ప్రశ్నించారు. కేవలం సీజన్ లోనే తాము యూనిఫామ్స్ కూడతామని, మిగతా సమయంలో పొలం పనులు, ఇతర ఉపాధి పనులు చేసుకుంటామని మహిళలు తెలిపారు. స్కూల్ యూనిఫామ్స్ తో పాటు వేరే ఎవరైనా ఏజెన్సీ బట్టలు కుట్టేందుకు మిమ్మల్ని సంప్రదింఛారా ?.అని ఆరా తీశారు. తాము స్కూల్ యూనిఫామ్స్ మాత్రమే కుడ తామని, వేరే ఏం కుట్టడం లేదని తెలిపారు. ఈ విషయంలో ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్ స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి మరీ వాళ్లకు స్కూల్ యూనిఫామ్స్ స్టిచింగ్ బాధ్యతలు అప్పగించి ఉపాధి కల్పిస్తుందని, ఈ సీజన్ లో ఒక్కో మహిళకు 5 వేల ఆదాయం వస్తుందని, సీజన్ తర్వాత మహిళలు ఇతర పనులతో ఉపాధి పొందుతారని వివరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ మొగులప్ప, డీడబ్ల్యు ఓ రాజేందర్ గౌడ్, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి ఈశ్వర్ రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, సిడిపివో సరోజ, ఎంఈవో రాంరెడ్డి, యాస్పరేషన్ బ్లాక్ సమన్వయ కర్త బాలాజీ, సూపర్ వైజర్ మానస, రాయికోడ్ గ్రామ డిప్యూటీ సర్పంచ్ మ్యాతారి గోపాల్, పెద్ద కడుమూరు, సర్పంచులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Spread the love

Related News