ప్రతిపక్షం, జూలై 10: తెలంగాణలో సాగునీటి అంశంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల కోసం తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తే తాను చూస్తూ ఊరుకోనని, అలాంటి చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తానని స్పష్టం చేశారు.
మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్.. “మేడిగడ్డలో చుక్క నీటిని కూడా నిల్వ చేయకండి. నదిలో వృథాగా పోతున్న నీటిని ఎత్తిపోసి రైతులకు అందించండి. సీఎం రేవంత్ రెడ్డి గారు.. ఈ విషయం అర్థం చేసుకోండి” అంటూ వ్యాఖ్యానించారు.
తాను కాంగ్రెస్ పార్టీని లేదా మరే రాజకీయ పార్టీని విమర్శించడానికి రాలేదని, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాల్సిన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానని చెప్పారు. రైతులకు అవసరమైన సమయంలో సాగునీరు అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, సాగునీటి సమస్యలపై అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు కొనసాగుతున్న వేళ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

















