ప్రతిపక్షం, జూలై 11: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. తాను బీజేపీలో చేరేందుకు మంతనాలు జరుపుతున్నానన్న సీఎం వ్యాఖ్యలను పూర్తిగా ఖండించిన ఆయన.. పార్టీలు మారడం తన రాజకీయ సంస్కృతి కాదని స్పష్టం చేశారు.
సోషల్ మీడియా వేదికగా స్పందించిన హరీశ్ రావు.. “రేవంత్ రెడ్డి.. మాట తప్పడం, పార్టీలు మార్చడం మీ రాజకీయ సంస్కృతి కావొచ్చు. కానీ అది నా రాజకీయ విధానం కాదు. మీ 20 ఏళ్ల రాజకీయ చరిత్ర, నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానమే దీనికి నిదర్శనం” అని వ్యాఖ్యానించారు.
కన్నెపల్లి పంపుల అంశాన్ని ప్రస్తావిస్తూ.. గోదావరి జలాలను రైతులకు వినియోగించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. కన్నెపల్లి పంపులను ఆన్ చేయకుండా నీటిని వృథాగా ఆంధ్రప్రదేశ్‌కు వదులుతున్నారని, ఇది ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇచ్చే “గురుదక్షిణ” అని విమర్శించారు.
తెలంగాణ రైతులకు అవసరమైన సమయంలో గోదావరి జలాలను ఎత్తిపోసే చర్యలు చేపట్టకుండా ప్రభుత్వం రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తోందని హరీశ్ రావు మండిపడ్డారు. రైతుల ప్రయోజనాల కంటే రాజకీయ విమర్శలపైనే కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఆరోపించారు.
కాగా, ఖమ్మంలో జరిగిన రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి.. హరీశ్ రావు బీజేపీ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆరోపిస్తూ, భద్రాద్రి శ్రీరాముడిపై ప్రమాణం చేసి చెప్పాలని సవాల్ విసిరిన విషయం తెలిసిందే. దీంతో ఇరు నేతల మధ్య రాజకీయ విమర్శలు మరింత తీవ్రతరమయ్యాయి.
















