ప్రతిపక్షం, జూలై 11: ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో 18 నెలల చిన్నారిని అత్యంత దారుణంగా హత్య చేసిన కేసులో జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు విరాజ్ అలియాస్ జితేంద్ర పాఠక్‌కు మరణశిక్ష విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో కేవలం 40 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి తీర్పు ఇవ్వడం విశేషంగా నిలిచింది.
ప్రేమ సంబంధానికి చిన్నారి అడ్డుగా ఉన్నాడనే కారణంతో నిందితుడు చిన్నారిని నేలకేసి కొట్టి హత్య చేసిన ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదుకావడంతో కేసు దర్యాప్తులో కీలక ఆధారాలుగా మారాయి.
తీర్పు వెలువడిన అనంతరం నిందితుడు కోర్టు ప్రాంగణంలో తనను తాను కొట్టుకున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెల్లడించారు. ఈ కేసులో వేగవంతమైన విచారణ జరిపి కఠిన శిక్ష విధించిన కోర్టు తీర్పును బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు స్వాగతించారు. చిన్నారులపై జరిగే నేరాలకు కఠిన శిక్షలు తప్పవనే సందేశాన్ని ఈ తీర్పు ఇచ్చిందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
















