ప్రతిపక్షం, జూలై 11: బహమాస్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుని 10 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధాని నసావుకు పశ్చిమాన ఉన్న నార్త్ ఆండ్రోస్ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదంలో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది సహా మొత్తం 10 మంది మృతిచెందినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడైంది.
బహమాస్ 53వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న సమయంలో ఈ విషాద ఘటన చోటుచేసుకోవడంతో దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
ఈ ఘటనపై బహమాస్ ప్రధానమంత్రి ఫిలిప్ బ్రేవ్ డేవిస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. విమానం కుప్పకూలడానికి కారణాలపై అధికారులు విచారణ చేపట్టగా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.
















