భద్రాచలానికి ముప్పు కాళేశ్వరంతో కాదు.. పోలవరంతోనే: కేటీఆర్

ప్రతిపక్షం, జూలై 11: మేడిగడ్డ బ్యారేజీ, కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. మేడిగడ్డలో నీటిని నిల్వ చేస్తే భద్రాచలానికి ముప్పు ఏర్పడుతుందన్న సీఎం వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.

భద్రాచలానికి ప్రమాదం కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కాదని, పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంపు వల్లనే ముంపు ముప్పు పెరుగుతుందని కేటీఆర్ అన్నారు. ఈ వాస్తవాన్ని పక్కనబెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రభుత్వం వ్యాఖ్యలు చేస్తోందని విమర్శించారు.

కన్నెపల్లి పంపులను ప్రారంభిస్తే ఎలాంటి ప్రయోజనాలు, ప్రభావాలు ఉంటాయనే అంశంపై ముఖ్యమంత్రి ఎప్పుడైనా సమగ్ర సమీక్ష నిర్వహించారా అని కేటీఆర్ ప్రశ్నించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని పట్టిసీమ వద్ద గోదావరి జలాలను ఎలా ఎత్తిపోస్తున్నారో ప్రభుత్వం ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.

రాజకీయ విభేదాలు ఉన్నాయనే కారణంతో రైతుల ప్రయోజనాలను పక్కనపెట్టొద్దని కేటీఆర్ సూచించారు. తమపై ఉన్న రాజకీయ కోపాన్ని రైతులపై చూపకుండా, గోదావరి వరద జలాలను సద్వినియోగం చేసేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. కాళేశ్వరం, కన్నెపల్లి పంపుల నిర్వహణపై రాజకీయాలకతీతంగా నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Spread the love

Related News

Latest News