- తన్నీరు హరీశ్ రావు, మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే,
ప్రతిపక్షం, నంగునూరు, జూలై 11: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియ పారదర్శకంగా నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు స్పష్టం చేశారు. సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో సర్ ప్రక్రియను శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో నిర్వహిస్తున్న సర్ ప్రక్రియ తీరును తనిఖీ చేశారు. బూత్ లెవెల్ అధికారి(బీఎల్వో)తో మాట్లాడి ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సర్ ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్వహించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు అని తెలిపారు. ఎలాంటి నిర్లక్ష్యం కారణంగా ఒక్క అర్హుడి పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకూడదన్నారు. బూత్ లెవెల్ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ అవసరమైన సమాచారాన్ని అందించాలని కోరారు. దరఖాస్తులు స్వీకరించే విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో మాట్లాడిన హరీశ్ రావు, ప్రతి ఓటరు సర్ ప్రక్రియలో తప్పనిసరిగా పాల్గొని తమ వివరాలను ధృవీకరించుకోవాలని సూచించారు. పేరు, చిరునామా లేదా ఇతర వివరాల్లో మార్పులు ఉంటే వెంటనే సంబంధిత ఫారాలు సమర్పించాలని తెలిపారు. ఓటు హక్కునుకాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులు పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.


















