- నెత్తురొడుతున్న వివాహ బంధం
- వరుస హత్యలతో కలకలం
- అక్రమ సంబంధాల మోజులో హత్యలు
- చెరసాల పాలవుతున్న ప్రేయసీ, ప్రియులు
- విడిపోయే అవకాశాలున్నా అంతమొందించడమే లక్ష్యం
- కుటుంబాల పరిస్థితి చిన్నాభిన్నం
- వైవాహిక బంధాలపై ఆందోళన
- ఉమ్మడి కుటుంబాలు లేకపోవడమే కారణమా?
(రాందేని చంద్రమౌళి, సీనియర్ జర్నలిస్టు)
ప్రతిపక్షం, జూలై 11: ‘నూరేళ్ళ జీవితం.. అగ్నిసాక్షిగా వేసిన ఏడడుగులు.. సుఖఃదుఃఖాల్లో తోడుంటాననే ప్రమాణం..’ వివాహ బంధం గురించి మనం చెప్పుకునే గొప్ప మాటలివి. నేడు కొన్నిచోట్ల ఈ పవిత్ర బంధం నెత్తురోడుతోంది. క్షణికావేశం, అక్రమ సంబంధాలు, ఆస్తి వ్యామోహం.. కారణం ఏదైనా కావచ్చు, ప్రాణంగా చూసుకోవాల్సిన భర్తలను భార్యలే కడతేరుస్తున్న ఉదంతాలు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. కట్టుకున్నవాడే అని కూడా చూడకుండా అత్యంత క్రూరంగా అంతమొందిస్తున్న సంఘటనలు చర్చంశాలవుతున్నాయి. ఒకప్పుడు, ఇప్పుడు భార్యలను చంపిన ఘటనలు అనేకం ఉన్నా, ఇటీవల జరుగుతున్న సంఘటనలు దేశ వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. భర్తలను చంపుతున్న వరుస సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎవరిని ఎవరూ చంపినా చట్టం శిక్షించినప్పటికీ, ఇంత క్రూర ఘటనలకు దారితీసే పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాల్సిందేననే అభిప్రాయాల వ్యక్తమవుతున్నాయి. చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా నైతిక విలువలు పెంపొందించకపోతే కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం, వ్యక్తిగత ఆదాయం పెరుగడం , సెల్ ఫోన్లు అందుబాటులోకి రావడం, ఇగోలకు పోవడం వంటి తదితర అంశాలు కొంత మందిని కోర్టు మెట్లెక్కిస్తున్నాయి. ఇష్టం లేకుంటే విడిపోవడానికి వీళ్లు ఎంచుకుంటున్న మార్గం సరైనదేనైనప్పటికీ, నమ్మిన తన బంధాన్ని కడతేర్చడమే ఇక్కడ చాలా విచారకరమైన విషయం. జరుగుతున్న ఘటనలు సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేయడం కాకుండా వివాహమంటేనే హడలిపోయే ప్రమాదమేర్పడింది. అయితే హత్యలు చేయడం సహజ మరణంగా చూపించడానికి ప్రయత్నించడం పోలీసులకు దొరకడం పరిపాటిగా మారింది. ఎంత తెలివి చూపెట్టినా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పోలీసుల నుండి తప్పించుకోలేరనే నిజం తెలియకపోవడం వారి పిచ్చి తనానికి నిదర్శనం. అడ్డుతొలిగించుకుంటే సుఖంగా ఉంటామని భావించి పోలీసులకు దొరికిపోయి కటాకటాల పాలవుతూ శిక్షలు అనుభవిస్తున్నారు. పిల్లలు, కుటుంబాల పరిస్థితి చిన్నాభిన్నంగా మారుతున్నది. సంస్కృతికి , సనాతన ధర్మానికి నిలయమైన మన దేశంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం అవడం అందోళనకరమైన విషయం.
నిజామాబాద్ న్యాల్‌కల్ హార్పిక్ ఇంజెక్షన్ హత్య
వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా మారాడనే కారణంతో నిజామాబాద్ శివారులోని న్యాల్‌కల్ గ్రామానికి చెందిన సంధ్య తన ప్రియుడు అనీల్, మరియు అతనికి సహకరించిన వెంకట సాయి అలియాస్ బంటి అనే వ్యక్తితో కలిసి భర్త ప్రశాంత్‌ను అత్యంత కిరాతకంగా హత్య చేసింది. ఉపాధి నిమిత్తం దుబాయ్‌లో పనిచేసి కొద్దిరోజుల క్రితమే స్వగ్రామానికి తిరిగి వచ్చిన ప్రశాంత్‌ను అందరూ నిద్రిస్తున్న సమయంలో భవనం పైనుంచి కిందకు తోసేశారు. ఆ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ప్రశాంత్‌ను ఆసుపత్రిలో చేర్చి, అతను ఇంకా బ్రతికే ఉన్నాడనే కక్షతో ఎవరూ లేని సమయం చూసి బాత్‌రూమ్ క్లీనర్ అయిన హార్పిక్ను సిరంజిలోకి తీసుకుని సెలైన్ ద్వారా అతని శరీరంలోకి భార్య సంధ్య ఎక్కించింది. ఆ రసాయనాల తీవ్రతకు అంతర్గత అవయవాలు దెబ్బతిని ప్రశాంత్ నరకయాతన అనుభవిస్తూ కన్నుమూశాడు. మొదట బిల్డింగ్ పైనుంచి పడి చనిపోయాడని అందరూ నమ్మినా, శవపరీక్ష రిపోర్ట్‌లో ప్రమాదకరమైన కెమికల్స్ ఉన్నట్లు తేలడం, పోలీసులు నిందితుల కాల్ డేటా, లొకేషన్లను విశ్లేషించి గట్టిగా విచారించడంతో ఈ ఘోరం బట్టబయలైంది.
హైదరాబాద్ మియాపూర్ మిస్సింగ్ డ్రామా హత్య
హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శారద అనే మహిళ తన ప్రియుడు శివతో ఉన్న అక్రమ బంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త వెంకటేష్‌కు మత్తుమందు ఇచ్చి గొంతు నులిమి హతమార్చింది. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని రాత్రికి రాత్రే కారులో మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతానికి తరలించి అక్కడ నిర్మానుష్య ప్రాంతంలో పాతిపెట్టి, ఆ తర్వాత శారద ఏమీ తెలియనట్లు పోలీసులకు వెళ్లి తన భర్త కనిపించడం లేదంటూ మిస్సింగ్ కేసు పెట్టి 7 నెలల పాటు నాటకమాడింది. సుదీర్ఘంగా దర్యాప్తు చేసిన పోలీసులు శారద యొక్క కాల్ డేటా రికార్డ్స్ , మొబైల్ లొకేషన్ హిస్టరీని లోతుగా పరిశీలించినప్పుడు, హత్య జరిగిన రోజు ఆమె లొకేషన్ మహారాష్ట్ర బోర్డర్ చూపించడం, ప్రియుడితో వందల సార్లు మాట్లాడటం గుర్తించి గట్టిగా విచారించడంతో శారద తన పాపాన్ని ఒప్పుకుంది.
పెద్దపల్లి కాశిపల్లి గృహహింస హత్య
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాశిపల్లి గ్రామంలో నిరంతర వేధింపులు, గృహహింస కారణంగా క్షణికావేశంలో ఒక భార్య భర్తను చంపిన ఘటన వెలుగుచూసింది. సయ్యద్ గోరేమియా, గోరీబీ దంపతుల మధ్య గత కొంతకాలంగా తీవ్రమైన గొడవలు జరుగుతుండటంతో ఆమె విడిగా ఉంటోంది, అయితే ఇటీవల భర్త మద్యం సేవించి వచ్చి మళ్లీ ఆమెతో ఘర్షణకు దిగి తీవ్రంగా కొట్టడంతో, ఆ వేధింపులు భరించలేక తీవ్ర మనస్తాపానికి గురైన గోరీబీ క్షణికావేశంలో పక్కనే ఉన్న మట్టిపెళ్లలు తీసుకొని భర్త తలపై, ముఖంపై బలంగా దాడి చేసి హతమార్చింది. గొడవ జరిగిన వెంటనే స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో, సుల్తానాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితురాలైన భార్యను, ఆమెకు సహకరించినట్లు భావిస్తున్న కుమారుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
న్యూఢిల్లీ త్రిలోకపురి శ్రద్ధా వాకర్ తరహా హత్య
దేశ రాజధాని తూర్పు ఢిల్లీలోని త్రిలోకపురిలో అచ్చం ‘శ్రద్ధా వాకర్’ మర్డర్ తరహాలోనే భార్య పూనమ్, ఆమె కొడుకు దీపక్ కలిసి భర్త అంజన్ దాస్‌ను ముక్కలు ముక్కలుగా నరికిన ఉదంతం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. అంజన్ దాస్‌కు వేరే మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని, ఆస్తి తగదాలు ఉన్నాయని కక్ష పెంచుకున్న పూనమ్, భర్తకు నిద్రమాత్రలు కలిపిన మద్యం ఇచ్చి చంపేసి, ఆ శవాన్ని ఏకంగా 22 ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచి, రోజూ రాత్రి పూట కొన్ని కొన్ని శరీర భాగాలను సమీపంలోని మైదానంలో విసిరేసేవారు. మైదానంలో కుళ్ళిపోయిన మానవ శరీర భాగాలు లభ్యం కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను జల్లెడ పట్టగా, అర్ధరాత్రి వేళల్లో పూనమ్, దీపక్ ప్లాస్టిక్ సంచులతో అనుమానాస్పదంగా తిరుగుతున్న దృశ్యాలు దొరకడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
కేరళ కూడతాయ్ సైనైడ్ వరుస హత్యలు
కేరళలోని కోజికోడ్ జిల్లా కూడతాయ్ గ్రామానికి చెందిన జోలీ జమ్మీ అనే మహిళ ఆస్తి మొత్తం తనకే దక్కాలనే ఆశతో, లగ్జరీగా బ్రతకాలనే వ్యామోహంతో తన భర్త రాయ్ థామస్‌తో పాటు కుటుంబంలోని మరో ఐదుగురు సభ్యులను ఆహారంలో ‘సైనైడ్’ కలిపి అత్యంత వ్యూహాత్మకంగా చంపేసింది. అందరూ అవి సాధారణ గుండెపోటు వల్లే జరిగాయని నమ్మగా, అమెరికాలో ఉన్న భర్త సోదరుడికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, సుదీర్ఘ దర్యాప్తు తర్వాత పాతిపెట్టిన శవాలను వెలికితీసి పరీక్షించగా అందరి శరీరాల్లో సైనైడ్ అవశేషాలు దొరికి ఈ ‘సైనైడ్ జోలీ’ కిరాతకం బట్టబయలైంది.
మేఘాలయ హనీమూన్ హత్య కేసు (2025)
వివాహం జరిగిన కొద్ది రోజులకే భర్త రాజా రఘువంశీని హత్య చేయడానికి భార్య సోనమ్ తన ప్రియుడితో కలిసి కుట్ర పన్నినట్లు పోలీసులు ఆరోపించారు. ఈ కేసు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. అప్పట్లో దుమారం రేగింది.
మీరట్ సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసు (2025)
సౌరభ్ రాజ్‌పుత్‌ను అతని భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు కలిసి హత్య చేసి, ఆధారాలు చెరిపివేయడానికి మృతదేహాన్ని డ్రమ్‌లో దాచినట్లు దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి.
మొరాదాబాద్, ఉత్తరప్రదేశ్ (2026)
పవన్ అనే వ్యక్తిని అతని భార్య, ఆమె ప్రియుడు మరియు ఇతర సహచరులు కలిసి చిత్రహింసలకు గురిచేసి హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు.
రేవారి, హర్యానా (2026)
వివాహమైన కొద్ది రోజులకే యువకుడిని అతని భార్య, ఆమె ప్రియుడు కలిసి హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేసినట్లు పోలీసులు వెల్లడించారు.
పుణె కేతన్ అగర్వాల్ హత్య కేసు (2026)
సియా గోయల్, ఆమె స్నేహితుడు చేతన్ చౌదరి కలిసి కేతన్ అగర్వాల్‌ను లోయలోకి తోసి హత్య చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది; ఆరోపణలు ఇంకా విచారణలో ఉన్నాయి. ఈ సంఘటన ఇప్పటికీ తీవ్ర సంచలనంగా నే ఉంది.
మధ్యప్రదేశ్ డాక్టర్ నీరజ్ పాఠక్ కేసు (2021)
ప్రముఖ వైద్యుడిని ఆయన భార్య మమతా పాఠక్ మత్తుమందు ఇచ్చి, విద్యుదాఘాతానికి గురిచేసి హత్య చేసినట్లు పోలీసులు ఆరోపించారు. అనంతరం ఆమెను అరెస్టు చేశారు.
ప్రేమికుడిపై ఎక్కువ ఆకర్షణ
భర్తకంటే ప్రేమికుడి మీద ఎక్కువ ఆకర్షణ కలిగి ఉండటం వల్ల ఇటువంటి హత్యలు జరుగుతున్నాయి. భర్తతో కుటుంబ బాధ్యతలు, పిల్లలు, ఆర్థిక ఒత్తిళ్లు ఉంటాయి. ప్రేమికుడితో మాత్రం బాధ్యతలు తక్కువగా ఉండటంతో ఆ సంబంధం తేలికగా, ఆనందంగా అనిపిస్తుంది. ఏళ్ల తరబడి కలిసి జీవించడం వల్ల సంబంధం అలవాటుగా మారుతుంది. కొత్త వ్యక్తితో ఉండే ఉత్సాహం, తెలియని అనుభూతి మెదడులో డోపమైన్ విడుదలను పెంచి ఎక్కువ ఆకర్షణను కలిగిస్తుంది. ప్రేమికుడు ప్రశంసలు, ప్రత్యేక శ్రద్ధ చూపడం వల్ల తమకు విలువ లభిస్తున్నట్లు అనిపిస్తుంది. ఇది భావోద్వేగ ఆకర్షణను పెంచుతుంది. భర్తతో భావోద్వేగ సంభాషణలు తగ్గినప్పుడు, తనను వినే వ్యక్తి పట్ల దగ్గరితనం పెరిగే అవకాశం ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో రోజువారీ కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఒత్తిళ్లు ఉండవు. అందువల్ల అది వాస్తవ జీవితం కంటే ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అయితే ఆ ఆకర్షణ వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించకపోవచ్చు. ప్రేమికుడి పట్ల కలిగే ఆకర్షణ చాలాసార్లు కొత్తదనం, భావోద్వేగ అవసరాలు, బాధ్యతలు లేకపోవడం వంటి అంశాల ప్రభావం. దాంపత్య జీవితంలో సమస్యలు ఉంటే పరస్పరం మాట్లాడుకోవడం, అవసరమైతే దాంపత్య కౌన్సెలింగ్ లేదా మానసిక ఆరోగ్య నిపుణుల సలహా తీసుకోవడం ద్వారా సంబంధాన్ని మెరుగుపరచుకోవచ్చు-
– డాక్టర్ కేశవులు, ఎండీ, సీనియర్ మానసిక వైద్య నిపుణులు
చట్టం ముందు ఏ నేరమూ దాగదు
ఎంత పక్కాగా ప్లాన్ చేసినా… ఫోన్ కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్, వేలిముద్రలు, డీఎన్ఏ పరీక్షల మరియు ఫోరెన్సిక్ సైన్స్ ముందు నేరస్థులు దొరికిపోవాల్సిందే. కట్టుకున్న భర్త ప్రాణాలు కోల్పోతే, కన్న బిడ్డలు అనాథలవుతారు, నేరానికి పాల్పడిన మహిళలు జీవితాంతం జైలు పాలవుతారు. నైతిక విలువల పతనం, బంధాలపై గౌరవం లేకపోవడమే ఇటువంటి దారుణాలకు కారణం అవుతున్నాయి, సమాజంలో మార్పు రావాలంటే కేవలం చట్టాలు సరిపోవు… కుటుంబ వ్యవస్థలో నైతిక విలువలు, కౌన్సిలింగ్, మానసిక పరిపక్వత ఎంతో అవసరం.నూటికి 80 శాతం కేసుల్లో వివాహేతర సంబంధాలే ఇలాంటి దారుణాలకు మూలకారణం అవుతున్నాయి. భర్త పేరిట ఉన్న ఆస్తులు, ఇన్సూరెన్స్ డబ్బులు లేదా విలాసవంతమైన జీవితం కోసం భర్తను వదిలించుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. కొన్ని కేసుల్లో భర్త నిరంతరం మద్యం తాగి వేధించడం, అనుమానించడం, కొట్టడం వంటివి భరించలేక… ఆ కక్షతో భార్యలు తిరగబడి ప్రాణాలు తీసే స్థాయికి వెళ్తున్నారు. సాంకేతికత, క్రైమ్ సీరియల్స్ నేరం ఎలా చేయాలో, శవాన్ని ఎలా మాయం చేయాలో ఈ రోజుల్లో ఇంటర్నెట్, యూట్యూబ్, క్రైమ్ వెబ్ సిరీస్‌ల ద్వారా సులభంగా తెలుసుకుంటున్నారు. తాము దొరికిపోమనే అతివిశ్వాసంతో పక్కా ప్లాన్‌తో హత్యలు చేస్తున్నారు. ఇష్టం లేకపోతే కోర్టుల ద్వారా లేదా పెద్దల ద్వారా విడిపోయే మార్గాలున్నాయి. హత్యలు ఎవరు చేసినా శిక్షలు తప్పవు. చట్టం నుంచి తప్పించుకోలేరు.-
– బి. సుదర్శన్ రెడ్డి, సీనియర్ న్యాయవాది (9441038189)
×––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
ప్రాణాలు తీయడం కరెక్ట్ కాదు
కలిసి ఉండడం ఇష్టం లేకపోతే చట్టపరంగా గౌరవంగా విడిపోయే అవకాశం ఉండగా హత్యలు చేయడం సరైన నిర్ణయం కాదు. దీనివల్ల ఎవరికి లాభం ఉండదు. పైగా కుటుంబం రోడ్డున పడుతుంది. పిల్లలు అనాథగా మారుతారు. మహిళలు, పురుషులు ఎవిరిని మరెవరు చంపినా జైలుశిక్ష తప్పదు. విభేధాలు ఉంటే శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. అనుభవమున్న పెద్దలను భాగస్వాములను చేయండి. లేదా కౌన్సిలింగ్ ప్రక్రియను ఆశ్రయించండి. కుదరని ఫక్షంలో ఇగోలకు తావులేకుండా కోర్టులను ఆశ్రయించి విడాకులు పొందండి. చంపడం వంటి క్రూరమైన చర్య ద్వారా సాధించేది ఏమీ ఉండదు. వివాహం అనేది రెండు మనసుల కలయిక. ఇది కేవలం ఒక చట్టబద్ధమైన ఒప్పందం మాత్రమే కాదు, నమ్మకం, ప్రేమ, పరస్పర గౌరవం, బాధ్యతలపై నిలిచే బంధం. ఒకవైపు మహిళలపై వరకట్న వేధింపులు, గృహహింస, మానసిక వేధింపులు, శారీరక హింస వంటి ఘటనలు జరుగుతుంటే, మరోవైపు పురుషులపై కూడా తప్పుడు కేసులు నమోదు చేయడం, మానసిక ఒత్తిడి కలిగించడం, కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురిచేయడం వంటి సంఘటనలు కనిపిస్తున్నాయి. చట్టం ఎవరికి వ్యతిరేకం కాదు. చట్టం అన్యాయానికి వ్యతిరేకం. నిజమైన బాధితులకు చట్టం బలమైన రక్షణను కల్పిస్తుంది. అదే సమయంలో తప్పుడు కేసులు నమోదైతే కోర్టులు వాటిని పరిశీలించి తగిన న్యాయం చేస్తాయి. అందువల్ల చట్టాలను ఆయుధాలుగా కాకుండా రక్షణ సాధనాలుగా ఉపయోగించాలి. మీడియేషన్, కౌన్సిలింగ్ వంటి ఉత్తమమైన ప్రక్రియలు ఉన్నాయి. మోసపూరిత వివాహాలు సమాజానికి హానికరం. పెళ్లికి ముందు ముఖ్యమైన విషయాలను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టడం, అబద్ధాలతో వివాహం చేయడం, ఆర్థిక ప్రయోజనాల కోసం లేదా ఇతర స్వార్థాల కోసం వివాహాన్ని ఉపయోగించడం నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చట్టం ముందు దొరికి పోక తప్పదు.-
– రేలంగి సునీత, న్యాయవాధి, కౌన్సిలింగ్ నిపుణులు(9959817117)


















