నంగునూరులో అల్ప-స్థాయి వంతెన నిర్మాణానికి శ్రీకారం

  • రూ.55 లక్షలతో కానుగు వాగుపై వంతెన పనులకు భూమిపూజ
  • మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవ, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కృషితో నిధుల మంజూరు

ప్రతిపక్షం, నంగునూరు, జూలై 11: మండల కేంద్రంలోని కానుగు వాగుపై ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అల్ప-స్థాయి వంతెన నిర్మాణానికి శనివారం శ్రీకారం చుట్టారు. నంగునూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జి మంత్రి డా. వివేక్ వెంకటస్వామి చొరవతో, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రత్యేక కృషి ఫలితంగా ఈ వంతెన నిర్మాణానికి రూ.55 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. గత పాలనలో ప్రతిపాదనలకే పరిమితమైన ఈ వంతెన నిర్మాణానికి ప్రస్తుతం నిధులు సమకూరడం స్థానిక ప్రజలకు ఆనందాన్ని కలిగించిందన్నారు.

కానుగు వాగుపై వంతెన నిర్మాణం పూర్తయితే ఘనపురం, నంగునూరు, రాంనగర్ గ్రామాల ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయని చెప్పారు. ముఖ్యంగా రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌కు తరలించడంలో ఇబ్బందులు తొలిగి పోతాయని చెప్పారు. రామాలయం, పెద్దమ్మ దేవాలయానికి వెళ్లే భక్తులకు సైతం సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుందని వివరించారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజల తరఫున వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన ఇంచార్జి మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, నిధుల కోసం ప్రత్యేకంగా కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు దేవులపల్లి యాదగిరి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇవ్వడం అభినందనీయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు రాగుల కృష్ణ, చెలికాని యాదగిరి, అనరాజు నాగరాజు, దాసరి కిషన్, బొల్లు సంజీవ్, రాగుల కనకయ్య, తుపాకుల శ్రీనివాస్, దేవులపల్లి భూమయ్య, సురేష్, ఎల్లుపల్లి రాజు, అనిల్, అనరాజు చందు, ఆంజనేయులు, పురుషోత్తం, అలీమ్, చంద్ పాషా, సత్యనారాయణ, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలు హాజరై వంతెన నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని ఆకాంక్షించారు.

Spread the love

Related News

Latest News