షాబాద్ ఘోరంపై హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం

ఆరు హత్యలు ప్రభుత్వ వైఫల్యమే

సీఎం, హోంమంత్రిగా రేవంత్ రెడ్డి విఫలం

బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ మహిళా నేతల అరెస్టుపై మండిపాటు

వికలాంగ బాలిక పేరిట రూ. కోటి డిపాజిట్ చేసి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్

ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట, జూలై 11: రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో చోటుచేసుకున్న ఆరుగురు హత్యల ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సిద్ధిపేటలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటన రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. షాబాద్‌లో పోక్సో కేసు నిందితుడు ముగ్గురు చిన్నారులతో పాటు మొత్తం ఆరుగురిని దారుణంగా హత్య చేయడం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర భయాందోళనలు కలిగించిందన్నారు. మైనర్ బాలికపై అత్యాచారం జరిగినప్పటి నుంచే పోలీసులు కఠిన చర్యలు తీసుకుని, నిందితుడిని వెంటనే అరెస్టు చేసి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదని ఆయన ఆరోపించారు.

బాధిత కుటుంబం తమకు ప్రాణహాని ఉందని పలుమార్లు పోలీసులను ఆశ్రయించినప్పటికీ అధికారులు స్పందించలేదని చెప్పారు. అదే నిర్లక్ష్యం అమాయకుల ప్రాణాలు బలి తీసుకుందని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. నిందితుడిపై కఠిన సెక్షన్లు నమోదు చేయక పోవడం, సమయానికి అరెస్టు చేయకపోవడం వల్ల అతడు బెయిల్‌ పై బయటకు వచ్చి ఈ దారుణానికి పాల్పడ్డాడని ఆరోపించారు.ఈ ఘటనలో కుటుంబంలోని దాదాపు అందరూ మృతి చెందగా, మాటలు రాని, చెవులు వినిపించని, నడవలేని వికలాంగ బాలిక ఒక్కరే మిగిలిపోయిందని పేర్కొన్నారు. ఆ చిన్నారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే ఆమె పేరిట రూ. కోటి ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి, పూర్తి సంరక్షణ బాధ్యతను స్వీకరించాలని డిమాండ్ చేశారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ మహిళా నేతలు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, పద్మా దేవేందర్ రెడ్డిలను అరెస్టు చేయడం దుర్మార్గమని హరీశ్ రావు విమర్శించారు. నేరస్తులను పట్టుకోవడంలో విఫలమవుతున్న ప్రభుత్వం, ప్రతిపక్ష నాయకులను మాత్రం నిమిషాల్లో అరెస్టు చేస్తోందని ఆరోపించారు.రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, పోలీస్ స్టేషన్లు ప్రజల రక్షణ కంటే రాజకీయ వేధింపులు, భూ సెటిల్‌మెంట్లకు కేంద్రాలుగా మారిపోయాయని హరీశ్ రావు విమర్శించారు. నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి, హోంమంత్రిగా రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని వెంటనే అరెస్టు చేసి కఠిన శిక్ష విధించాలని ప్రభుత్వానికి సూచించారు. అరెస్టయిన బీఆర్ఎస్ మహిళా నాయకులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Spread the love

Related News

Latest News