ప్రతిపక్షం, జూలై 12: హైదరాబాద్ నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల విమానమైన ఎమిరేట్స్ A-380 సర్వీసులను ప్రారంభించేందుకు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ సానుకూలంగా స్పందించింది. ఎమిరేట్స్ విమానయాన సంస్థ (ఇండియా-నేపాల్) వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సర్హన్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా ఈ అంశంపై చర్చ జరిగింది. సంస్థ భారత కార్యకలాపాలకు 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా జరిగిన ఈ సమావేశంలో హైదరాబాద్‌కు మరిన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం కోరారు.
హైదరాబాద్ నుంచి ఎమిరేట్స్ A-380 విమానాలను నడపడంతో పాటు ప్రస్తుత విమాన సర్వీసుల సంఖ్యను కూడా పెంచాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో త్వరలో వరంగల్, ఆదిలాబాద్‌లలో కొత్త విమానాశ్రయాలు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో రాష్ట్రం విమానయాన రంగానికి కీలక కేంద్రంగా మారే అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు. ఇదే క్రమంలో ఎమిరేట్స్ సంస్థ తన మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్‌హాల్ (MRO) కార్యకలాపాలను తెలంగాణలో ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ సహకారం పూర్తిగా అందిస్తామని హామీ ఇచ్చారు.
అదేవిధంగా గచ్చిబౌలిలో ఏర్పాటు చేస్తున్న స్పోర్ట్స్ యూనివర్సిటీలో క్రీడాకారుల శిక్షణ, అభివృద్ధికి ఎమిరేట్స్ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కింద స్పాన్సర్‌షిప్ అందించాలని సీఎం కోరారు. ఈ ప్రతిపాదనపైనా ఎమిరేట్స్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తులపై ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సర్హన్ సానుకూల సంకేతాలు ఇచ్చారు. హైదరాబాద్ నుంచి A-380 సర్వీసుల ప్రారంభంపై సంస్థ పరిశీలన చేపడుతుందని, అలాగే తెలంగాణలో క్రీడా అభివృద్ధికి సహకరించే అంశాన్ని కూడా సానుకూలంగా పరిశీలిస్తామని ఆయన తెలిపారు. ఈ భేటీతో హైదరాబాద్‌కు మరిన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులు, పెట్టుబడులు వచ్చే అవకాశాలు మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.

















