ప్రతిపక్షం, జూలై 13: తెలంగాణలో 1 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు, విద్యార్థుల్లో నులిపురుగుల నివారణ కోసం జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయనున్నట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, జూనియర్ కళాశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ అధికారులు విద్యార్థులకు నిపుణుల పర్యవేక్షణలోనే ఆల్బెండజోల్ మాత్రలను అందజేసి, అక్కడికక్కడే వేయించేలా చర్యలు తీసుకుంటున్నారు. మాత్రలను విద్యార్థులకు ఇంటికి పంపించకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ మాట్లాడుతూ, ఆల్బెండజోల్ మాత్రలను ఖాళీ కడుపుతో తీసుకోకూడదని సూచించారు. పిల్లలు తప్పనిసరిగా అల్పాహారం లేదా ఇతర ఆహారం తీసుకున్న తర్వాతే ఈ మాత్రలను వేయాలని తెలిపారు. దీంతో ఎలాంటి అసౌకర్యం లేకుండా మందు ప్రభావవంతంగా పనిచేస్తుందని వివరించారు.
నులిపురుగుల వల్ల పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత, ఎదుగుదల మందగించడం, చదువుపై ప్రభావం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి అర్హత కలిగిన చిన్నారి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆల్బెండజోల్ మాత్ర తీసుకోవాలని ఆరోగ్యశాఖ విజ్ఞప్తి చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఆరోగ్యశాఖ సంయుక్తంగా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

















