ప్రతిపక్షం, జూలై 13: ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీల ఎంపీలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో జరిగే ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా పాల్గొననున్నారు.
రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై పార్లమెంట్లో సమన్వయంతో ముందుకెళ్లే లక్ష్యంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో పాటు బీజేపీ, ఎంఐఎం లోక్సభ సభ్యులు, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు.
సమావేశంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులు, వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన ఆర్థిక సహాయం, కేంద్ర అనుమతులు అవసరమైన అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల వివరాలను ఎంపీలకు ప్రభుత్వం అందించనుంది.
మెట్రో రైలు విస్తరణ, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, సాగునీటి పథకాలు, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, కేంద్ర పథకాల కింద రావాల్సిన నిధులు వంటి కీలక అంశాలు సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఈ అంశాలను పార్లమెంట్లో బలంగా వినిపించి రాష్ట్రానికి నిధులు సాధించే దిశగా అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
రాజకీయ భేదాలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధి, రాష్ట్ర హక్కుల సాధనే ప్రధాన లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తెలంగాణకు సంబంధించిన అంశాలను సమిష్టిగా ప్రస్తావించి, కేంద్రం నుంచి పెండింగ్ నిధులు, ప్రాజెక్టుల ఆమోదాలు సాధించేందుకు అన్ని పార్టీల ఎంపీలు కలిసి పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరనున్నట్లు సమాచారం.


















