నేడు దేవాదుల ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి.. పురోగతి, నీటి విడుదలపై సమీక్ష

ప్రతిపక్షం, జూలై 13: తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని సందర్శించనున్నారు. ప్రాజెక్టు పనుల పురోగతి, నీటి విడుదల పరిస్థితులు, ఇంకా పూర్తి చేయాల్సిన పనులపై ప్రత్యక్షంగా సమీక్ష నిర్వహించనున్నారు.

ఈ పర్యటనలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు సాగునీటి శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్, పంచాయతీరాజ్ మంత్రి సీతక్క తదితరులు ముఖ్యమంత్రితో కలిసి పాల్గొననున్నారు. ప్రాజెక్టు అధికారుల నుంచి పనుల పురోగతిపై వివరాలు తెలుసుకుని, అవసరమైన సూచనలు చేయనున్నట్లు సమాచారం.

దేవాదుల ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందించే ప్రక్రియ, పెండింగ్‌లో ఉన్న నిర్మాణ పనులు, భవిష్యత్ కార్యాచరణపై కూడా సీఎం అధికారులతో సమీక్షించే అవకాశం ఉంది. ప్రాజెక్టు సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

ఆదివారం ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన సమావేశంలో దేవాదుల ప్రాజెక్టు పర్యటనతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి, సంబంధిత మంత్రులు చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ప్రజలకు వివరించే అంశంపైనా సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం.

రాష్ట్రంలో సాగునీటి వ్యవస్థను బలోపేతం చేయడం, రైతులకు సమయానికి నీటిని అందించడం ప్రభుత్వ ప్రాధాన్య అంశాలని పేర్కొంటున్న ప్రభుత్వం, దేవాదుల ప్రాజెక్టు పర్యటన అనంతరం ప్రాజెక్టుకు సంబంధించి కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశముందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

Spread the love

Related News

Latest News