ప్రతిపక్షం, జూలై 13: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో కుటుంబ కలహాలు దారుణానికి దారితీశాయి. ఆస్తి వివాదం నేపథ్యంలో భార్య, ఇద్దరు కూతుళ్లు కలిసి కుటుంబ పెద్దను హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, కుటుంబానికి చెందిన 4.5 ఎకరాల వ్యవసాయ భూమి విషయంలో గత నాలుగేళ్లుగా తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. అప్పులు తీర్చేందుకు భూమిని విక్రయించాలని భర్త పట్టుబడగా, భూమిని అమ్మకూడదని భార్య, కూతుళ్లు వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. ఈ వివాదం చివరకు ఘర్షణకు దారి తీసి, భర్తను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, హత్య జరిగిన పరిస్థితులు, నిందితుల పాత్రపై విచారణ కొనసాగుతోంది.



















