ప్రతిపక్షం, జూలై 13: థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లోని ఓ ప్రముఖ పబ్‌లో సంభవించిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో కనీసం 27 మంది మృతి చెందగా, మరో 63 మంది గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సుమారు అరగంట పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే పబ్‌లోని అనేక మంది దట్టమైన పొగలో చిక్కుకోవడంతో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో పలువురు పబ్ వెనుక భాగంలోని మరుగుదొడ్ల సమీపంలో గుర్తించబడినట్లు వెల్లడించారు.
థాయ్‌లాండ్ ప్రధాని అనుతిన్ చార్న్‌విరాకుల్ ఘటనాస్థలాన్ని సందర్శించి 27 మంది మృతి చెందిన విషయాన్ని ధ్రువీకరించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాల ప్రకారం, వేదిక సమీపంలోని విద్యుత్ సర్క్యూట్ బ్రేకర్ వద్ద మొదట పొగ కనిపించిందని, అనంతరం విద్యుత్ సరఫరా నిలిచిపోయి పేలుడు సంభవించడంతో మంటలు వేగంగా వ్యాపించాయని సమాచారం.
అగ్నిప్రమాదానికి సంబంధించిన కారణాలు, భద్రతా ప్రమాణాల్లో ఏవైనా లోపాలు ఉన్నాయా అనే అంశాలపై థాయ్ అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు. ఈ ఘటనతో దేశంలో వినోద కేంద్రాల్లో అగ్నిమాపక భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

















