ప్రతిపక్షం, జూలై 13: హైదరాబాద్‌లో పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) కొత్త అడ్వెంచర్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. హుస్సేన్‌సాగర్ పరిసరాల్లోని ప్రముఖ పర్యాటక కేంద్రాలైన ఎన్‌టీఆర్ గార్డెన్స్, లుంబినీ పార్కుల్లో త్వరలో బంగీ ట్రాంపోలిన్ (బంగీ జంప్)తో పాటు చిన్నారుల కోసం ప్రత్యేకంగా కిడ్స్ ట్రాంపోలిన్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ కొత్త వినోద సదుపాయాల ద్వారా నగరానికి వచ్చే దేశీయ, విదేశీ పర్యాటకులతో పాటు కుటుంబాలు, చిన్నారులను ఆకర్షించాలని హెచ్‌ఎండీఏ లక్ష్యంగా పెట్టుకుంది. నగరంలో అడ్వెంచర్ టూరిజాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగానే ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు సమాచారం.
ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు మూడు సంవత్సరాల పాటు అప్పగించనున్నారు. భద్రతా ప్రమాణాలు, నిర్వహణ నిబంధనలను పాటిస్తూ సందర్శకులకు సేవలు అందించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం బంగీ ట్రాంపోలిన్‌కు ఒక్కో టికెట్ ధర రూ.60, చిన్నారుల కోసం ఏర్పాటు చేసే కిడ్స్ ట్రాంపోలిన్‌కు రూ.40గా ప్రతిపాదించారు. అయితే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత నిర్వహణ వ్యయం, ఇతర అంశాలను బట్టి టికెట్ ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న హెచ్‌ఎండీఏ, ఈ కొత్త అడ్వెంచర్ సదుపాయాలతో నగర పర్యాటక రంగానికి మరింత ఊతం లభిస్తుందని భావిస్తోంది.

















