ప్రతిపక్షం, జూలై 13: హైదరాబాద్‌లో జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎస్సీల సంక్షేమం, విద్య, సామాజిక సమానత్వం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుపై ఇరువురు విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యార్థుల మధ్య కుల వివక్షను పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో ప్రభుత్వం పలు సంస్కరణలు అమలు చేస్తోందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి వీటిని దశలవారీగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
నర్సరీ నుంచి 12వ తరగతి వరకు నాణ్యమైన విద్యను ఒకే ప్రాంగణంలో అందించేందుకు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని సీఎం వివరించారు. విద్యార్థులకు పాఠశాలల్లోనే అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించడంతో పాటు రవాణా సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్‌లో ఇటువంటి పాఠశాలల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని వెల్లడించారు.
రాష్ట్రంలో ఎస్సీ వర్గాలకు వారి జనాభా నిష్పత్తికంటే అధిక అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సీఎం తెలిపారు. రాజకీయాలు, ప్రభుత్వ వ్యవస్థలు, ఇతర కీలక రంగాల్లో ఎస్సీలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. అలాగే ఎస్సీ వర్గీకరణ అమలు ప్రక్రియను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని వివరించారు.
ఎస్సీల సంక్షేమం, విద్య, ఉపాధి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన ఆర్థిక, పరిపాలనా సహకారం అందేలా జాతీయ ఎస్సీ కమిషన్ చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి కిషోర్ మక్వానాను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రం పూర్తి మద్దతు అందించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.




















