హార్ముజ్‌కు రక్షణ మాదే.. ఖర్చు ప్రపంచ దేశాలే భరించాలి: ట్రంప్

ప్రతిపక్షం, జూలై 13: ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక వ్యాఖ్య చేశారు. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతను అమెరికా సైన్యమే పర్యవేక్షిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ మార్గంలో ప్రయాణించే వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించేందుకు అమెరికా భారీగా ఖర్చు చేస్తోందని, అందువల్ల ఈ సేవల కోసం ప్రపంచ దేశాలు తమకు తగిన రీయింబర్స్‌మెంట్ (ఖర్చు చెల్లింపు) చేయాలని డిమాండ్ చేశారు.

హార్ముజ్ జలసంధి ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గాల్లో ఒకటి. గల్ఫ్ దేశాల నుంచి ఎగుమతి అయ్యే భారీ స్థాయి ముడి చమురు, సహజ వాయువు ఈ మార్గం ద్వారానే ప్రపంచ మార్కెట్లకు చేరుతుంది. ఇలాంటి సమయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.

ఇటీవల ఇరాన్‌తో అమెరికా ఉద్రిక్తతలు మరింత పెరిగిన నేపథ్యంలో హార్ముజ్ జలసంధిపై ఆధిపత్య పోరు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితులు కొనసాగితే అంతర్జాతీయ చమురు సరఫరాపై ప్రభావం చూపడంతో పాటు ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి ఎనర్జీ సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Spread the love

Related News

Latest News