టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం
సిద్దిపేట, ప్రతిపక్షం, జూలై 14: జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కె. హైమావతికి కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా జర్నలిస్టులు వార్తలు, కథనాల సేకరణ సమయంలో అధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి ఎదురవుతున్న వేధింపులను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా బాధ్యులు శ్రీనివాస్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు మంజూరు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా హెల్త్ కార్డులు అందించాలని, వాటి కంట్రిబ్యూషన్‌ను ప్రభుత్వమే భరించాలని కోరారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు వెంటనే కేటాయించి, ప్రక్రియను యుద్ధప్రాతిపదికన ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. రాత్రి వేళల్లో విధులు నిర్వహించే మహిళా జర్నలిస్టులకు కార్యాలయం నుంచి ఇంటి వరకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని, జర్నలిస్టులకు ఉచిత ఆర్టీసీ, మెట్రో పాసులు అందించాలని కోరారు. అలాగే రైల్వే పాసుల పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ సభ్యులు రేవంత్ కుమార్, భాస్కర్, ప్రేమ్, యాదగిరి, శ్రీనివాస్ రెడ్డి, రాజు, కిష్టయ్య, జనార్ధన్, నర్సింలు, రాములు, చంద్రం, మోహన్, సంజీవ్, నరసింహారెడ్డి, శ్రీను తదితరులతో పాటు డీజేఎఫ్ సభ్యులు చందు తదితరులు పాల్గొన్నారు.


















