ఎల్‌నినో తగ్గేందుకు సూర్యుడినే డిమ్ చేసే టెక్నిక్!

ప్రతిపక్షం, జూలై 14: ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఎండలు, తక్కువ వర్షపాతం, వాతావరణ అస్థిరతకు కారణమవుతున్న ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించేందుకు అమెరికా శాస్త్రవేత్తలు కొత్త సాంకేతిక విధానాన్ని ప్రతిపాదించారు. ‘సోలార్ జియో ఇంజినీరింగ్’ పేరుతో అభివృద్ధి చేస్తున్న ఈ విధానం ద్వారా భూమిపైకి చేరే సూర్యకిరణాల తీవ్రతను కొంత మేర తగ్గించే అవకాశం ఉందని వారు వెల్లడించారు.

ఈ విధానంలో భాగంగా సముద్రాలపై ఏర్పడే మేఘాల్లో సల్ఫేట్స్, కాల్షియమ్ కార్బొనేట్ వంటి ప్రత్యేక ఏరోసాల్ కణాలను విడుదల చేయాలని ప్రతిపాదిస్తున్నారు. దీంతో మేఘాలు మరింత ప్రకాశవంతంగా మారి, సూర్యకిరణాల్లో కొంత భాగాన్ని అంతరిక్షంలోకి తిరిగి ప్రతిఫలింపజేస్తాయని శాస్త్రవేత్తలు వివరించారు. ఫలితంగా భూమి ఉపరితల ఉష్ణోగ్రతలు కొంత తగ్గే అవకాశం ఉండి, ఎల్‌నినో ప్రభావం తీవ్రత కూడా తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు.

అయితే ఈ సాంకేతికత ఇంకా పరిశోధనా దశలోనే ఉందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. దీని వల్ల వాతావరణ వ్యవస్థపై, వర్షపాతం విధానాలపై, పర్యావరణ సమతుల్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందనే అంశాలపై మరిన్ని అధ్యయనాలు అవసరమని పేర్కొంటున్నారు.

వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు ప్రత్యామ్నాయ సాంకేతిక పరిజ్ఞానాలపై పరిశోధనలు కొనసాగుతున్న నేపథ్యంలో, సోలార్ జియో ఇంజినీరింగ్ కూడా శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తున్న కీలక అంశంగా మారింది. అయితే ఈ విధానాన్ని అమలు చేసే ముందు అంతర్జాతీయ స్థాయిలో విస్తృత చర్చలు, శాస్త్రీయ నిర్ధారణలు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Spread the love

Related News

Latest News