కేంద్ర అనుమతులు, నిధుల సాధనే లక్ష్యం.. ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్

ప్రతిపక్షం, జూలై 14: హైదరాబాద్: రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన కేంద్ర అనుమతులు, పెండింగ్ నిధుల సాధనపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లగా, అంతకుముందు రాష్ట్రానికి చెందిన ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో అభివృద్ధి అంశాలపై పార్టీ రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలతో పాటు బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ ఈ సమావేశానికి హాజరు కాలేదు.

రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు, ఆర్థిక సహాయం త్వరగా అందేలా కృషి చేయాలని సీఎం ఎంపీలను కోరారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ, రీజినల్ రింగ్ రోడ్, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, నీటిపారుదల ప్రాజెక్టులు, విమానాశ్రయాలు, ఐఐఎం ఏర్పాటు వంటి అంశాలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

ఇదే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలోనూ కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి పెండింగ్‌లో ఉన్న అనుమతులు, నిధుల విడుదలపై చర్చించనున్నట్లు సమాచారం. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టులను వేగవంతం చేయడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యంగా ప్రభుత్వం పేర్కొంటోంది.

Spread the love

Related News

Latest News