హైదరాబాద్, ప్రతిపక్షం, జూలై 14: హైడ్రా (HYDRAA) ఫైర్ ఎన్‌ఓసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) జారీ, రెన్యూవల్ సేవలను పూర్తిగా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో దరఖాస్తుదారులు ఇకపై కార్యాలయాలకు వెళ్లకుండా ఇంటి నుంచే అన్ని సేవలను పొందే అవకాశం కల్పించింది.
దరఖాస్తుదారులు హైడ్రా అధికారిక వెబ్‌సైట్లో దరఖాస్తు సమర్పించడం, నిర్ణీత ఫీజు చెల్లించడం, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయడం, అలాగే ఫైర్ ఎన్‌ఓసీ ధ్రువీకరణ పత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకోవడం వంటి సేవలను ఆన్‌లైన్‌లోనే వినియోగించుకోవచ్చు.
ఈ ఆన్‌లైన్ సేవలను హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ పరిధిలోని నాన్ హై–రైజ్ భవనాలకు విస్తరించినట్లు అధికారులు తెలిపారు. ఈ విధానం అమల్లోకి రావడంతో దరఖాస్తుల ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగవంతంగా మారడంతో పాటు ప్రజలకు సమయం, వ్యయం ఆదా కానుంది. ఇకపై ఫైర్ ఎన్‌ఓసీ కోసం ప్రత్యేకంగా హైడ్రా కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని అధికారులు స్పష్టం చేశారు.

















