31 ఏళ్లనాటి కేసు… లాలూకు ఊరట

ప్రతిపక్షం, జూలై 14: దాదాపు మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న బిహార్ పశుదాణా కుంభకోణం కేసులో మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు సుప్రీంకోర్టులో కీలక ఊరట లభించింది. ఈ కేసులో లాలూ ప్రసాద్‌కు మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

లాలూ ప్రసాద్‌కు బెయిల్ మంజూరు చేస్తూ గతంలో ఝార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునే అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే బెయిల్ మంజూరై ఏడేళ్లకు పైగా గడిచిన నేపథ్యంలో, ఇప్పుడు దానిని రద్దు చేయాలన్న సీబీఐ అభ్యర్థనను ఆమోదించడం సమంజసం కాదని న్యాయస్థానం పేర్కొంది.

అదే సమయంలో, ఈ కేసు విచారణను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఝార్ఖండ్ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసును వేగంగా పరిష్కరించాలని సూచించింది.

1995లో వెలుగులోకి వచ్చిన పశుదాణా కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రభుత్వ ఖజానా నుంచి పశువుల దాణా కొనుగోళ్ల పేరుతో సుమారు ₹940 కోట్ల ప్రజాధనాన్ని అక్రమంగా దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌తో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులపై వివిధ దశల్లో విచారణ కొనసాగుతోంది.

Spread the love

Related News

Latest News