ప్రతిపక్షం, జూలై 14: ఉడాన్ (UDAN) పథకాన్ని మరో పదేళ్లు పొడిగిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. రూ.30 వేల కోట్ల వ్యయంతో దేశవ్యాప్తంగా 100 కొత్త విమానాశ్రయాలు, 200 హెలిపోర్టులను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైన అనంతరం మాట్లాడిన ఆయన, 2028 జూన్ 2 నాటికి వరంగల్ (మామునూరు) విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. బౌండరీ వాల్, రన్‌వే పనులకు టెండర్లు సిద్ధంగా ఉన్నాయని, మరో 3–4 వారాల్లో టెర్మినల్ భవన నిర్మాణానికి టెండర్లు పిలుస్తామని వెల్లడించారు. కాకతీయ కళా వైభవాన్ని ప్రతిబింబించేలా టెర్మినల్‌ను నిర్మిస్తామని తెలిపారు.
ఆదిలాబాద్‌లో డిఫెన్స్–సివిలియన్ విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని, ఇందుకోసం సుమారు 1,500 ఎకరాల భూసేకరణ అవసరమని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం రికార్డు స్థాయిలో భూసేకరణ పూర్తి చేయడంతో ప్రాజెక్టుల అమలు వేగవంతమైందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.


















