ప్రతిపక్షం, జూలై 14: తెలంగాణలో భారీ పెట్టుబడులకు మరో కీలక అడుగు పడనుంది. భారత్ ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ నిర్మాణానికి ఈ నెల 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఈ ప్రాజెక్టుకు బీజం 2025 జనవరిలో సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన సందర్భంగా పడింది. ఆ సమయంలో అమెజాన్ ప్రతినిధులతో జరిగిన చర్చల్లో సంస్థ తెలంగాణలో రూ.60 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించింది. అనంతరం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025లో ఈ పెట్టుబడికి సంబంధించిన అవగాహన ఒప్పందంపై ఇరు పక్షాలు సంతకాలు చేశాయి.
ప్రాజెక్టు కోసం ప్రభుత్వం భారత్ ఫ్యూచర్ సిటీలో 202 ఎకరాలు, చందన్‌వెల్లిలో 98 ఎకరాలు కలిపి మొత్తం 300 ఎకరాల భూమిని కేటాయించింది. అదనంగా రూ.125 కోట్ల విలువైన ప్రోత్సాహకాలు, రాయితీలు కూడా మంజూరు చేసింది.
ఈ డేటా సెంటర్ ప్రాజెక్టుతో తెలంగాణలో ఐటీ మౌలిక వసతులు మరింత బలోపేతం కావడంతో పాటు భారీ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఊతం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.


















