వర్షాకాలానికి అప్రమత్తంగా ఉండాలి.. రైతులకు అవగాహన కల్పించండి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, జూన్ 01: రాష్ట్రంలో వర్షాకాల సన్నద్ధతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటేరియట్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నైరుతి రుతుపవనాల ప్రభావం, వర్షపాతం అంచనాలు, ఎల్ నినో పరిస్థితులపై వాతావరణ శాఖ అధికారులు ప్రజెంటేషన్ ఇవ్వగా, రైతులకు ముందస్తు అవగాహన కల్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో సాగు చేయగల పంటలపై రైతులకు మార్గనిర్దేశం చేయాలని సూచించారు. అలాగే పంట మార్పిడి, పంటల వైవిధ్యీకరణ వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించాలని చెప్పారు.

అదేవిధంగా రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్వహణ పనులపై సీఎం ప్రత్యేకంగా సమీక్షించారు. గేట్లు, ఇతర మరమ్మతు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్వహణకు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని సంబంధిత శాఖలకు సూచించారు.

విపత్తు నిర్వహణకు కేటాయించిన నిధులను నిబంధనల మేరకు సమర్థవంతంగా వినియోగించాలని సీఎం పేర్కొన్నారు. వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న రహదారులు, వంతెనల మరమ్మతులకు అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించారు.

ప్రకృతి విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి, పశు నష్టాలు సంభవించినప్పుడు అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. సమావేశంలో వ్యవసాయ, నీటిపారుదల, పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి, ఆరోగ్య, హోమ్, విపత్తు నిర్వహణ తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News