ధాన్యం కొనుగోళ్లలో రేవంత్ ప్రభుత్వం విఫలం: రామచందర్ రావు

ప్రతిపక్షం, జూన్ 01: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రామచందర్ రావు విమర్శించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారని, అయితే క్షేత్రస్థాయిలో ఆ హామీ అమలు కావడం లేదని ఆరోపించారు.

రైస్ మిల్లర్లతో ప్రభుత్వం కుమ్మక్కైందని ఆరోపించిన ఆయన, రాష్ట్రవ్యాప్తంగా రైతులు తీసుకొచ్చిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద, రహదారులపై కుప్పలుగా పేరుకుపోయిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నేరుగా ధాన్యం కొనుగోలు చేయదని, రాష్ట్రాలు కొనుగోలు చేసిన ధాన్యానికే తిరిగి నిధులు చెల్లిస్తుందని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఎంత పంట దిగుబడి వచ్చిందో కేంద్రానికి ప్రభుత్వం సరైన సమాచారం అందించలేదని విమర్శించిన రామచందర్ రావు, రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ చేపట్టిన ఆందోళనల కారణంగానే ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలకు లారీలను పంపుతోందని పేర్కొన్నారు.

అదేవిధంగా, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జాతీయ నాయకులు పాల్గొంటారని చెప్పారు.

మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్పై ఇటీవల వెలిసిన పోస్టర్లకు పార్టీ అంతర్గత విభేదాలతో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

Spread the love

Related News

Latest News