ప్రతిపక్షం, జూలై 15: హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరంగల్ జిల్లాకు చెందిన భాస్కర్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, భాస్కర్‌కు తన స్వగ్రామానికి చెందిన నిఖిత అనే యువతితో గతంలో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కుటుంబ సభ్యులు ఆమెకు మూడేళ్ల క్రితం మరో వ్యక్తితో వివాహం జరిపించారు. ఇటీవల ఆ దంపతులు విడాకులు తీసుకున్న నేపథ్యంలో, ఇందుకు భాస్కర్ కారణమనే అనుమానంతో యువతి తండ్రి కక్ష పెంచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
భాస్కర్‌ను నరికి చంపారని మృతుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల అసలు కారణాలు, నిందితుల పాత్రపై పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.

















