ప్రతిపక్షం, జూలై 15: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని పోలీసులు నిర్బంధించడాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలపై శాంతియుత నిరాహార దీక్ష చేపట్టేందుకు సిద్ధమైన ఎమ్మెల్యేను నిర్బంధించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
భీంగల్ మున్సిపాలిటీ అభివృద్ధి, 100 పడకల ఆసుపత్రి నిర్మాణం, ఆర్టీసీ డిపో పునరుద్ధరణ వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ప్రశాంత్ రెడ్డి దీక్షకు సిద్ధమయ్యారని హరీశ్ రావు తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో ఆయనను పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని విమర్శించారు.
ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, పోలీసు వ్యవస్థను రాజకీయంగా వినియోగిస్తోందని ఆరోపించారు. ప్రజా సమస్యలను లేవనెత్తే ప్రతిపక్ష నేతలపై నిర్బంధ చర్యలు మానుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఆయన ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.

















